వ్యదార్థ జీవుల జీవనయానం – పూణే ప్రయాణం
తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడూ ఎడరై, ఎందరికో ఒయాసిస్సై అన్న అలిశెట్టి ప్రభాకర్ మాటలు ఎప్పటికీ ఆరిపోని రక్తరేఖలు. ఈ రేఖలు మన సరిహద్దులు దాటి పొట్ట కూటి కోసం ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి వంచనకు, వేదనకు, గురవుతూ, వాడిపోతూ, గుభాళింపు కోల్పోతూ, నలిగిపోతున్న మల్లెలు. ఈ మల్లెల సువాసనలు దోచుకోవడనికి సొమ్ము చేసుకోవడనికి ఎవరెవరు ఏఏ వలవిసిరి వారిని ఎలా ఈ కూపంలో దించుతారో సవివరంగా, వార్తా కథనాలుగా వ్రాసిన గంగాధర్‌కు జీవితం విలువ అంటే ఏమిటో బాగా తెలుసనిపిస్తుంది. ఈ ‘పూణే ప్రయాణం’లో పూణేలో మగ్గిపోతున్న వ్యభిచారుల జీవితం ఎలా వుంటుందో వివరంగా పొందుపరిచాడు.
మన రాష్ట్రం నుండి ఎంతో మంది అమ్మాయిలు తమ కడుపుకోసమో, విలాసం కోసమో, రక్త సంబంధీకులను పోషించటం కోసమో, వెళ్ళి అనేక కష్టాలకు లోనై భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వలలో చిక్కుకుంటున్నారు. ఈ చిక్కుకున్న వారిలో రాయలసీమలోని ఎక్కువ గిరిజన తండల నుండి వచ్చిన అమ్మాయిలే. ఒక్కొకరిది ఒక్కొక్క వ్యధ.
ఘర్‌వాలీలతో ఎలాంటి కష్టాలుంటాయో, హసీనా కథ వివరిస్తుంది. పూణే వ్యభిచార కేంద్రం నుండి సెక్స్‌వర్కర్స్ రాసుకున్న ”ఒక కన్నీటి లేఖ”లో ఒక తెలుగు వ్యక్తి వ్యభిచార గృహానికి వెళితే, ఆయనకు తమ వెతలన్నీ చెప్పి, వాళ్ళనెలాగైనా విడిపించమని వేడుకునే దృశ్యం ఇందులో కనిపిస్తుంది. నలుగురు ఆడపిల్లలను పోషించలేక పెద్దకూతురు సుశీలమ్మను పూణేకు పంపించిన తండ్రి, డబ్బులకోసం ఎంతో ఆశపడి నరకూపంలోకి దింపిన వైనం ”అత్తరు పూసిన నెత్తురు పూలు” ఎపిసోడ్‌లో కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క కథనం ఒక్కొక్క దీన దృశ్యాన్ని, మన ముందు నిలుపుతుంది. అలాగే ట్రాఫికింగ్‌లో మనదేశంలో 18 సంవత్సరాల లోపు బాలలు / బాలికలు ఇరుక్కుని, తమ భవిష్యత్తును బంగారు బాల్యాన్ని ఎలా కోల్పోతున్నారో, దీన్ని ఎలా నివారించాలో చెబుతారు రచయిత. ఈ కోటి గొంతుల కన్నీటి రోదనను ఎవరైనా విని కొంతలో కొంత మారుతారనే ఆశ రచయితలో కనపడుతుంది. ఆ ఆశ ఫలించాలని మనం కూడా కోరుకుందాం.
- డా|| జి.వి. సాయిప్రసాద్
పూణే ప్రయాణం
రచన : వేంపల్లి గంగాధర్, ప్రచురణ : ఉషస్సు ప్రచురణలు
వెల : రూ||20/-, పుటలు : 40
4/432/ఎ, వివేకానందనగర్, కడప-1, ఆం.ప్ర.సెల్ : 94400 74893