గాలి గంగమ్మ

- వి.ప్రతిమ

[సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు - 2007లో స్త్రీవాద కేటగిరీ కింద ప్రథమ బహుమతి రూ. 5,000/-లు పొందిన కథ]

”వీణా ఏం మాట్లాడ్తున్నావ్‌ నువ్వు?… ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుందా?… నోటికెంతొస్తే అంతా అనేయడమేనా పెద్దా, చిన్నా లేకుండా” నా కంఠంలోని తీవ్రతకి కొంత జంకినట్టయి… మళ్ళీ తను వెనక్కి తగ్గకూడదనుకున్నదో ఏమో,
”నీకు తెలీదత్తా… యింత దూరం నుండి నిన్ను పిలిపించి ఇక్కడ మధ్యస్థం పెట్టించాల్సి వచ్చిందంటే నువ్వే ఆలోచించుకో” అన్నది అంతే తీవ్రంగా…
ఆ పిల్ల కళ్ళు క్రోధంతో ఎరుపెక్కి ముక్కుపుటాలు ఆవేశంతో అదురుతున్నాయి… అసలే పాలుగారే చర్మమేమో బుగ్గలు రోజా రంగులోకి మారిపోయాయి. వాకిట్లోని కొబ్బరాకులు కిటికీలో నుండి వీధిలైటు వెలుతురును మోసుకొచ్చి వీణ మొహం మీది నుండి కదలాడుతూ డైనింగ్‌ టేబిల్‌ మీద కుప్ప పోస్తున్నాయి…
నేను చిరాకు నణుచుకుంటూ వెళ్ళి టి.వి. స్విచ్చాఫ్‌ చేశాను. దాని మూలంగానే యింట్లో అందరమూ యింత హెచ్చు స్థాయిలో మాట్లాడుతున్నామని నా ఉద్దేశ్యం… కానీ అదుంటేనే ఒకరింటి గొడవలు మరొకరికి విన్పించవంటుంది వీణ… వీణ యింకా యింకా చాలానే అంటోంది.
నిన్నగాక మొన్న నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వీణ, ఈ చేతుల్తో పెంచి పెద్ద చేసిన వీణ… ఎన్నెన్ని విషయాలు మాట్లాడుతోంది… ఎంతెంత హితబోధ చేస్తోంది… ఎవరినయినా ఎంత నిర్దాక్షిణ్యంగా ఖండిస్తోంది… చాలా వింతగా వుంది.
గాలినంతా బయటికి లాగేసిన చీకటి గదిలో వూపిరాడక కొట్టుకుంటున్నట్లుగా వుంది పరిస్థితి… అడకత్తెరలో పోకచెక్కని గుర్తు తెచ్చుకుంటూ భయం భయంగా వదినకేసి చూశాను..
పీడకలలోంచి ఉలిక్కిపడి లేచిన పసిపాపలా నిశ్చేష్టురాలై వుంది వదిన…
నిలువెల్లా ఆక్రమించి విభ్రమ గొల్పిన వీణ మాటల తాలూకు దిగులు ఆమెను శిలాసదృశం చేసిందేమో…
అప్పటికి ‘గాలి గంగమ్మ’ అన్న మాట రింగురింగుమంటూ చెవుల నుండి పెద్ద వలయాలుగా మారి గదిలో నుండి క్రమంగా బయటికి వెళ్తోంది…
ఖచ్చితంగా వదిన గుండెల్లోంచి మాత్రం బయటికెళ్ళి వుండదు…
కొత్తగా కొన్న జాతీయ టి.వి. పెద్ద సౌండ్లో వుంటేనే తప్ప నిద్రపోడేమో చింటూ లేచి ఏడుపుకెత్తుకున్నాడు… వీణ మాట్లాడ్డమాపి ఆతృతగా తన
గదికేసి పరిగెత్తింది…
నేను దీర్ఘంగా నిట్టూరుస్తూ వదిన పక్కనున్న కుర్చీలోకి మారాను ఎటువంటి చప్పుడూ చేయకుండా…
బయటనున్న అమావాస్య చీకటినంతా వూడ్చుకొచ్చి యింట్లో పోత పోసినట్లుగా కూర్చుని వుంది వదిన… ఆమె బయటా, లోపలా కూడ చీకటి
వున్నట్లుంది…
ఇల్లు, పిల్లలు, భర్త తప్ప మరో ప్రపంచమే ఎరుగని వదిన కుటుంబం పట్ల ఎంతో బాధ్యత వహించిన వ్యక్తి… యిప్పుడీ వయసులో ఎందుకింత
నిర్లక్ష్యంగా వుంటోంది?- వీణ మాటల్లో చెప్పాలంటే చాలా స్వార్థపూరితంగా వ్యవహరిస్తోంది. ఇల్లు పట్టకుండా గాలిగంగమ్మలా తిరుగుతోంది… మా
కుటుంబ సభ్యులందరి ఆరోపణా కూడ యిదే…
ఇటు కూతుళ్ళు, అల్లుళ్ళు… అటు యిరువైపులా వియ్యంకులూ అంతా అన్నయ్యని చూసి జాలిపడుతున్నారు… వదిన్ని చూసి చుట్టుపక్కలంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు… చెవులు కొరుక్కుంటున్నారు… అది వాళ్ళకి చాలా యిష్టమైన పని…
ఆలోచనలోనే మెల్లిగా వదిన చేతిమీద చేయాన్చాను మాట కలుపుదామని… ఏదో లోకంలో నుండి ఉలిక్కిపడి తేరుకున్నట్లుగా కళ్ళు కదిపింది… ఆమె చూపులు గోడకేసి కొట్టుకుని వెనక్కి తిరిగి వస్తూ నిర్భావంగా వున్నాయి… గాజుగోళాల్లా వున్న ఆమె కళ్ళకేసి చూడ్డానికి భయమేసి తలదించుకున్నాన్నేను…

గాలి గంగమ్మ

గాలి గంగమ్మ

ఇంద్ర ‘టీ’ కలిపినట్టున్నాడు.
రెండు కప్పుల్లో తెచ్చి ఒకటి నా చేతికిచ్చి, రెండోది వదిన ముందు టేబిల్‌ మీద పెట్టాడు… మామూలుగానే పెట్టి వుంటాడు . . . నాకెంతో పెద్ద శబ్దమొచ్చినట్లుగా అన్పించింది… బహుశా అర్ధరాత్రి అలుముకున్న నిశ్శబ్దం మూలంగా కావచ్చు…
”ఎందుకయ్యా ఇంత రాత్రిపూట’ అన్నాన్నేను మొహమాటంగా…
అసలే అన్నకు అల్లుడు… అందునా మా నెల్లూరు రెడ్లలో అల్లుడంటే పై అధికారితో సమానం… ఎదురుగా అత్తలు కూర్చోకూడదు… వదిన ఈ మధ్యన యివేవీ పట్టించుకున్నట్లుగా లేదు… ఆ మాటకొస్తే వదిన యింకా చాలా విషయాలు పట్టించుకోవడం లేదు… అందుకే మా  చుట్టుపక్కలందరికీ వదిన ఆసక్తి కేంద్రమయిపోయింది…
చింటూ నిద్రపోయినట్టున్నాడు… వీణ మళ్ళీ వచ్చింది. మాతోపాటు కూర్చోడానికి యిష్టపడని దానిలా అవసరం లేకపోయినా డైనింగ్‌ టేబిల్‌ మీద ఏదో సర్దుతోంది…
”మళ్ళీ ఎందుకొచ్చావురా… వెళ్ళి పడుకో… ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలి కదా… వెళ్ళు చాలా రాత్రయింది…” వీణని మెత్తగా కోప్పడ్డాడు ఇంద్ర.
‘ఇదెప్పుడూ వుండే భాగోతమే కదా అనవసరంగా నువ్వెందుకు స్ట్రెయినవుతావు?’ అన్నట్లుగా వుందతడి ధోరణి…
వీణ జూనియర్‌ కాలేజిలో లెక్చరర్‌గా పనిచేస్తోంది… పెళ్ళయ్యే నాటికి ‘ఇంద్ర’ ఒక ప్రైవేట్‌ కాలేజిలో లెక్కలు చెప్తూండేవాడు… పది, పదిహేను
వేల జీతాలతో సౌకర్యంగా బతకలేమని దాన్ని వదిలేసి రియలెస్టేట్‌ చేస్తున్నానంటాడు. తండ్రి నడిగి, ఇటు మామనడిగి లక్షలు తీసికెళ్ళి
బెంగళూరులోనూ, హైదరాబాదులోనూ మదుపు పెడ్తున్నాడు… పెట్టడమే తప్ప వచ్చిన జాడలేవీ కన్పించడం లేదు. ఏం జరుగుతోందో అడగడానికి అన్నకి దమ్ముల్లేవు…
డైనింగ్‌ హాల్లో వున్న జీరో వాట్స్‌ బల్బు మసకమసగ్గా వెలుగుతూ ఆరుతోంది.
ఆ మసక చీకటిలో ఒకరి మొహాలొకరికీ, ఒకరి భావాలు మరొకరికీ ఏమీ కన్పించడం లేదుగానీ గొంతుల్లోని తీవ్రత మాత్రం స్పష్టంగానే వుంది…
అరగంట ముందు తెగిన సంభాషణని ముడిపెడ్తున్నదానిలాగా
”అత్తా నువ్వేం చేస్తావో, ఏం చెప్తావో నాకు తెలీదు… ఈమిట్లా వూళ్ళు తిరగడం ఏమీ బాగా లేదు… పద్ధతిగా లేదు… డాడీకి కావల్సినవి చేసి పెడ్తూ, ఆయన ఆరోగ్యం చూసుకుంటూ గుట్టుగా యింట్లో పడుండమను… ఆయనొక్కడ్నీ యింట్లో వొదిలేసి ఈమెకెందుకత్తా ఈ తిరుగుళ్ళు? చూశావు కదా నువ్వొచ్చి మూడు రోజులయింది… ఈ రోజుటికి దిగబడింది… ఇంకా యిక్కడేమైనా తిరగాల్సినవి వుంటే రేపటిగ్గాని పోదు డాడీ దగ్గరికి…” తల్లిని అమ్మ అనడనిక్కూడ ఇష్టపడని దానిలా ఈమె ఈమె అని పరాయిదానిలా గుచ్చి పలుకుతూ నాకు పెద్ద అల్టిమేటం జారీ చేసి వెళ్ళింది వీణ… నయమే ‘ఈ మనిషి’ అనలేదు.
దీర్ఘంగా వూపిరి తీసుకుని ఒకటీ ఈస్టు రెండు నిష్పత్తిలో వొదిలి పెట్టాన్నేను… ఇప్పుడు నన్నాదుకునేది ప్రాణాయామమొక్కటే…
వదిన కూడ ‘ష్షే’ అంటూ సుదీర్ఘంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులో నుండి వీణ అన్న ‘గాలిగంగమ్మ’ అన్న మాట శ్వాసతో పాటుగా బయటికొస్తూ, లోపలికెళ్తూన్నట్లుగా వుంది…
బయట లైటార్పి ముందరింటి తలుపు గెడిపెట్టి తనూ గదిలోకి వెళ్ళిపోయాడు ఇంద్ర…
కొంతసేపు గడిచింది కష్టంగా…
నేనూ, వదినా భారంగా పైకి లేచి మాకు కేటాయించబడిన పడగ్గది వైపు నడవసాగాం…
ఎలాగయినా ఈ రాత్రికి వదినతో మాట్లాడించాలనే గట్టిగా నిర్ణయించుకున్నాన్నేను…
  
‘సాహిత్యంతో నాకేం సంబంధం వుందంటున్నావా పుష్పా?..” వదిన ఆ మాట అడుగుతోన్న తీరూ, ఆ ముఖంలోని నిర్వేదం, నిర్భావంగా నా
కళ్ళలోకి చూస్తోన్న కళ్ళూ… నన్ను తీవ్ర పశ్చాత్తాపంలో ముంచాయి…
ఛఛ వీణ మాటలు విని వదిన్ని అలా అడిగుండాల్సింది కాదేమో…
ఒకవైపు అపరాధభావం… మరోవంక ‘అసలా సాహిత్యంతో ఈమెకేం సంబంధం? తిరపతిలో సాహిత్య బ్రహ్మోత్సవాలంట… దానికెళ్ళింది… వారం దినాలయింది… యోగా అంటాది, ధ్యానం అంటాది… ఆ ఓం శాంతి గ్రూపు వాళ్ళతో కలిసి ‘మౌంట్‌ ఆబూ’ వెళ్ళి పదిహేను రోజులు రాలేదు… ఎక్కడికనుకుంటే అక్కడికి బయల్దేరేస్తాది… డాడీ నొదిలిపెట్టి తాడూ, తగరాదూ లేనోళ్ళు తిరిగినట్టు తిరగాలంటే అవతాదా?… నువ్వే చెప్పత్తా…”
మొన్న వుదయం నేనొచ్చినప్పట్నుండీ, క్షేమ సమాచారలయ్యీ కాకముందే వీణ తన తల్లి గురించి చెప్పిన మాటలు అన్నీ స్విచ్చేసిన వాషింగ్‌ మెషీన్లో బట్టల్లా నా మెదడులో గిర్రున తిరుగుతున్నాయి…
”నాకు తెలీకడగతాను పుష్పా వీళ్ళ డాడీకేమయినా కుంటా గుడ్డా?…
లేకపోతే మంచంలో వున్నాడా?… రిటైర్మెంటు తర్వాత కూడ వూరికే వుండలేనంటూ మళ్ళీ ప్రవేటు కాలేజీలో చేరాడు కదా… వంట చేసి
పెట్టడనికేమో జయరాం ఉన్నాడు… కనీసం యిప్పుడయినా నాకు నచ్చినచోటికి నేను వెళ్ళడానికి లేదా?… నాకు నచ్చినట్లుగా నేనుండకూడదా?” స్థాయి చిన్నదిగానే వున్నా నిలదీస్తున్నట్లుగా వుంది వదిన గొంతు…
నిజమేఁ అన్న ఎప్పుడూ తన కాలేజేమో, తనేమో, తన యిష్టాయిష్టాలేమో, తన స్నేహితులేమో… వచ్చిన జీతంలో సగం వదిన చేతికిచ్చేసి తన తిరుగుళ్ళేవో తను తిరుగుతూండేవాడు… ఎప్పుడూ కూడా బాధ్యతలు పట్టించుకునేవాడు కాదు… మొత్తం వదినే చక్కబెట్టేది… మా మిగిలిన అక్కచెల్లెళ్ళకన్నా నాకు వదినతో యింత దగ్గరి అనుబంధముండటానికి కారణం నేను డిగ్రీ మూడేళ్ళు నెల్లూరు వి.ఆర్‌.కాలేజీలో చదివాను… అప్పుడు అన్నావాళ్ళతోనే వుండేదాన్ని…
అప్పటికి నయన, వీణ యిద్దరూ చిన్నపిల్లలు…
వదిన రోజంతా పనిచేస్తూనే వుండేది… ఎప్పుడయినా సమయం దొరికితే మంచిమంచి పుస్తకాలు చదూతుండేది… వీధి మలుపులో వున్న లెండింగ్‌ లైబ్రరీ నుండి చాలా పుస్తకాలు తెచ్చుకుని చదివి యిచ్చేస్తూండేది… ఎన్నోసార్లు తను చదివిన కథల గురించీ, నవలల గురించీ వాటిలోని మంచిచెడుల గురించీ, జీవితపు విలువల గురించీ భోజనాల దగ్గర నాతో, పిల్లలతో విశ్లేషించేది. వదినకి పుస్తకాలంటే ఎంత ప్రాణమో నాకు బాగా తెలుసు…
బహుశా ఆ వయసులో అన్న నిర్లక్ష్యాన్ని తట్టుకోవడానికి పుస్తకాలే గొప్ప ధైర్యాన్నిచ్చాయేమో తనకి… వదిన మంచి మంచి పెయింటింగ్స్‌ కూడా వేసేది…
సృజనాత్మకత వుంది. అటువంటి వదిన్నా నేను ముందూ వెనకా చూడకుండా ‘సాహిత్యంతో నీకేం సంబంధము తిరుపతి వెళ్ళావ్‌’ అంటూ నిలదీశాను…..
ప్చ్‌
ఒక నేరభావమేదో గాఢమైన దిగుల్లోకి నెట్టి నన్ను కుదురుగా కూర్చోనివ్వడం లేదు…
ఏనాడూ సినిమాక్కూడ వచ్చేది కాదు వదిన… ఏమన్నా అంటే ”ఇద్దరూ ఆడపిల్లలు కద పుష్పా జాగ్రత్త లేకపోతే ఎట్లా?” అనేది… అప్పట్లో
నాకర్థమయ్యేది కాదుగానీ యిప్పుడు తలుచుకుంటే వదిన తన స్వసుఖాలన్నీ వొదులుకుని ఈ యిద్దరు ఆడపిల్లల కోసం ఎంత గొడ్డుచాకిరీ చేసేదా అన్పిస్తుంది… వదిన అప్పట్లో చీరలు కూడ అమ్మేది… మధ్యాహ్నం వేళ తీరిక చేసుకుని అందరిళ్ళకూ వెళ్ళి డబ్బులు కలెక్ట్‌ చేసుకొచ్చేది…
వదిన ఏదో చెప్తోంది… కాసేపు నా ఆలోచనల కలకలం ఆగింది.
”నువు సరిగ్గా వుంటే మీ ఆయనెందుకు బయట తిరుగుతాడు” అంటూ అంతా ఆయన్నే సమర్థించే వాళ్ళు… నేనెందుకు సరిగ్గా వుండలేకపోయాను? నేనెందుకు ప్రియురాలిలాగా వొగలు పోతూ ప్రేమ మాటలు చెప్పలేకపోయాను అన్నది ఒక్కరు కూడా ఆలోచించలేదు.
నేను నాలుగ్గంటలకు ముందే నిద్రలేచి నీళ్ళు పట్టుకోవాలి… ఏడున్నరకల్లా పిల్లలకు టిఫిన్లూ, పాలూ, లంచ్‌బాక్సులూ సర్దాలి… ఈ లోపల మీ అన్న ఎన్నిసార్లు కాఫీ అడిగితే అన్నిసార్లు అందించాలి… పేపర్లు నమిలి మింగే మగాడు ఎన్నిసార్లు కాఫీలు తాగుతాడో లెక్కుంటాదా?…
స్టవ్వు రుద్ది రుద్దీ చేతులరిగిపోతాయి… ఇంటిపనంతా చేసుకుని మళ్ళీ బయటి పన్లకి పరిగెత్తాల… గ్యాస్‌ సిలిండరయిపోతుంది… పిల్లలకి ఫీజులు కట్టి వాళ్ళ ప్రోగ్రెస్‌ గురించి టీచర్లతో మాట్లాడి రావాల… కరెంటు బిల్లులు, ఫోను బిల్లులు కట్టాల… ఇంట్లో ఏ చిన్న రిపేరొచ్చినా ఆ పనోళ్ళ దగ్గరికి నేనే పరిగెత్తాల… ఇల్లంతా నీటుగా, తళతళలాడుతూ వుండడానికి ఆడోళ్ళు ఎంతెంత శ్రమ పడతారో, ఎంత శక్తి ధారపోస్తారో నీకు మాత్రం తెలీదా పుష్పా?…
ఈ సందన నాకు ప్రేమించడానికీ, సినిమాల్లోలా యుగళగీతాలు పాడ్డానికీ తీరికెక్కడుంది చెప్పు? అయినా ఈ మగాళ్ళకి కావల్సింది నిజమైన గుండెల్లోంచి వచ్చే ప్రేమలు కావులే పుష్పా… పైపై నటనలు…” చివరి మాట అంటూండగా వదిన గొంతు బొంగురుపోయింది.
కనుకొలకుల్లో నిండిపోయి జారడానికి సిద్ధంగా వున్న నీటిబొట్టుని యింక బిగపట్టడం సాధ్యం కాలేదు వదినకి… ఆ బొట్టు వదిన చెక్కిలి మీది నుండి జారి అనేక ప్రశ్నలై గుండెల మీదికి వర్షిస్తోంది…
‘కానీ వదినా అప్పుడంతా ఉగ్గపట్టుకున్నావు కదా బిడ్డల కోసమైతేనేం?
సంసారం కోసమైతేనేం… ఇప్పుడెందుకింత ఏమీ పట్టనట్లుగా వుంటున్నావు?…’ అని అడగబోయి ఏదో అర్థమయ్యీ, కానట్లుగా అన్పించి మానేశాను…
చాలాసేపు మా యిద్దరి మధ్య మౌనం… ఆ నీరవ నిశ్శబ్దంలో టిక్కుటిక్కుమంటూ శబ్దం చేస్తోన్న గోడ గడియారం మా యిద్దరితో పాటు
మూడో మనిషి వున్న భావనని కలిగిస్తోంది…
వదిన తనే మళ్ళీ మాట్లాడ్డం మొదలుపెట్టింది.
‘ఆయనకు తాగడం అలవాటయితే నన్నే తిడ్తిరి… సిగరెట్లు మాన్పించలేదనీ నన్నే అంటిరి… ఆయన అనారోగ్యం కూడా నా చాతకాని తనమేనా?… పైసా పైసా కూడబెట్టడానికి నేనెంత కష్టపడ్డానో నీకు తెలీదా?… నేను ఉద్యోగం చేయలేదనేగాని యింటికి నేనొక ఆర్థిక మంత్రిలాగా పనిచేశాను… మీ అన్నకి వేరేవేరే స్నేహాలయినప్పటి నుండీ నేనెంత బాధపడ్డాను… ఎంత ఆందోళన పడ్డాను. వచ్చిన డబ్బులొచ్చినట్లు పిల్లలిద్దరికీ నగలు చేయించి పెట్టేసేదాన్ని…
యిద్దరూ ఆడపిల్లలు… అసలే రోజురోజుకీ పెరుగుతోన్న బంగారం ధరలు…
పెళ్ళిళ్ళు కావడం కష్టమని వాళ్ళ పేరుతో బ్యాంకు డిపాజిట్లు చేసేదాన్ని…
చీటీలు కట్టీ, వడ్డీల కిచ్చుకునీ, చీరలమ్మీ, మిషను కుట్టీ ఎన్నెన్ని రకాలుగా పొదుపు చేశానో నీకు తెలీదా పుష్పా…
నేననేదాన్ని లేకపోతే మీ అన్న వీళ్ళిద్దరి పెళ్ళిళ్ళూ యింతింత మంచి సంబంధాలు చేసి వుండేవాడా? అంతెందుకు పిల్లలిద్దర్నీ చదివించి వుద్యోగాలు చేసేలా నిలబెట్టి వుండేవాడా?… నిజం చెప్పు పుష్పా నాముందు కాకపోయినా మీ మనసుల్లోనయినా మీరు ఒప్పుకునే తీరాలి…” గుక్క తిప్పుకోవడానికన్నట్లుగా కాసేపు ఆగింది వదిన…
ఆ శీతాకాలపు తెల్లవారుఝామున వీస్తోన్న చలిగాలులు ఎంత మాత్రమూ నా ఉద్వేగాన్ని తగ్గించలేకపోతున్నాయి… వదిన చెప్తోన్న దాంట్లో ఒక్కమాట కూడ అబద్ధం లేదు… మా అమ్మా, నాన్న ఎన్నడూ వదినకి చెయ్యందివ్వలేదు…
ఎప్పుడూ కొడుకునే సమర్ధించేవాళ్ళు… పైగా ఆడపిల్లల పెళ్ళిళ్ళూ, పురుడ్లూ, పుణ్యాలూ ఎంతసేపటికీ ఆ గొడవే తప్ప కోడలు కూడా ఆడబిడ్డేనని వాళ్ళెప్పుడూ అనుకోలేదు… వదినకి చిన్నప్పుడే తల్లిలేదు. వదిన పెళ్ళయ్యాక తండ్రి మరణించాడు… ఉన్న ఒక్క తమ్ముడూ సరయిన చదువబ్బక… ఆ పల్లెటూళ్ళో బడుగు రైతులా గుడిసుళ్ళు పడుతున్నట్లున్నాడు.. వదిన ఎప్పుడూ అటు వాళ్ళ సాయానికిగానీ, ఇటు అత్తమామల సాయానికిగానీ ఎదురు చూసినట్లుగా లేదు…
సుదీర్ఘంగా జరిగిపోయిన జీవితానికి వదిన అవతలి కోణాలని విశ్లేషిస్తూంటే ఆశ్చర్యంగా వుంది నాకు… చాల ఒప్పుదలగా వున్న వదిన మాటలను వింటూ ఆమెకేసి చూస్తున్నాన్నేను… మానసికంగా, శారీరకంగా కూడ చాలా నీర్సంగా కన్పిస్తోంది వదిన…

”ప్చ్ ఏరుదాటి తెప్ప తగలేసినట్లుగా యిప్పుడు మీ అన్నా, పిల్లలు ఏమంటున్నారో తెలుసా పుష్పా…
నేను ఉద్యోగం చేయకపోగా మీ అన్న సంపాదించిందంతా చీరలూ, నగలూ కొని… అల్లుళ్ళకి అడిగినంత కట్నాలిచ్చి, ఘనంగా పెళ్ళిళ్ళు చేసి అంతా వేస్ట్‌ చేసేశానంట… ఎక్కడయినా ఒక్క సెంటు నేల కొనిపెట్టావా అంటూ నిలదీస్తున్నారు. మీ అన్నకు ఉద్యోగం వచ్చాక యింక వ్యవసాయం ఎవురు చేస్తార్లే అని వున్న నేలనే అమ్మేశారు కదా మీ అమ్మా, నాన్న… మరి భూమి కొని పెట్టాలన్న ఆలోచన నాకెందుకుంటుంది చెప్పు?… మన నెల్లూరు జిల్లాకి రెండు టెక్స్‌టైల్‌ పార్కులొచ్చి భూములకి రెక్కలొచ్చేస్తాయని నేనేమయినా కలగన్నానా?…
ఒక్కసారిగా కోటీశ్వరులయిపోయారంట తమ తోటి వాళ్ళంతా… మనం మాత్రమే యిలా లక్షాధికారులుగా పేదగా మిగిలిపోయామని ప్రతీక్షణం నన్ను దెప్పి పొడుస్తూనే వున్నారు… అదొక్కటే కాదు నేను ఏదీ ప్లాన్డ్‌గా చేయలేదంట…
నాకు ముందాలోచన లేకపోబట్టే, ప్లాను లేకపోబట్టే అందరి జీవితాలూ దెబ్బతిని పోయాయంట… నిజమే పుష్పా ఈ యింటి బాధ్యతనంతా మొత్తంగా తవ్వి తలకెత్తుకోవడమే నేను చేసిన తప్పు… ఈ బాధ్యత, ఈ పని యిద్దరిదీ.
అతడిక్కూడ సమానంగా పంచాలనే ఆలోచన, ప్లాను లేకపోవడమే నా తప్పు…
నేను చాలా తప్పులే చేశాను పుష్పా ప్లాను లేకుండా” మంచం మీదనే రెండు మోకాళ్ళనీ దగ్గరికి చేర్చి తలదాచుకుంది వదిన… మొత్తంగా తడిచి ముడుచుకు పోయిన గువ్వలా వుంది వదిన్ని అలా చూస్తుంటే…
నాకు అన్నమీద, పిల్లల మీద చాలా కోపమొచ్చింది… ఎప్పుడో స్థలం కొనిపెట్టి వుంటే యిప్పుడు పదిరెట్లయ్యేది కదాని నగలు, యిల్లు ఆ నిష్పత్తిలో పెరగలేదని ఆ నేరాన్నంతా వదిన మీదికి నెట్టి నేను తెచ్చిన డబ్బంతా తగలేశావంటూ వేధిస్తూంటే యింట్లో ఎలా వుండబుద్ధేస్తుంది ఎవరికయినా?…
వీణతో గట్టిగా మాట్లాడాలి…
అసలా మాటకొస్తే యిప్పుడు మా ఆయన నన్నింత దూరం పంపిన కారణం కూడా అదే… కూతురు, అల్లుడు, కొడుకు ఎన్నారైలు… సంపాదించిన డబ్బు ఏం చేయాలో తెలీక స్థలాలు కొనమన్నారు… నెల్లూర్లో విపరీతంగా పెరిగిపోతోన్న ధరల గురించి విని ‘వెళ్ళి మీ అన్నతో మాట్లాడి మంచి స్థలం చూడమను’ అని పంపించాడు… పైకి మాత్రం అన్నా, వదినల మధ్యస్థం కోసం వచ్చినట్లు… ప్చ్‌… అందరమూ ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాకుండా వుంది…
”మనం కొనలేకపోయిన స్థలాల మీద, మిస్సయిపోయిన ధరల మీదా యింతింత పశ్చాత్తాపమెందుకు పుష్పా… మనది కాని డబ్బు మీద, వస్తువుల మీద యింత ఆత్రం దేనికి?… మాటిమాటికీ అప్పుడు అయిదొందలు అంకణం, అదే యిప్పుడు ఇరవై వేలు… వందంకణాలు కొని పడేసుంటే యిప్పుడు రెండు కోట్లు… మా అమ్మా, నాయినకి అంత దూరాలోచన ల్యాకపాయ” ఈ మాటలు యిక్కడ వీణ నోట్లో నుండే కాదు…
టెక్స్‌టైల్‌ పార్కులొచ్చి లక్షకి విలువ లేకుండ పోయాక నెల్లూరు జిల్లాలో ప్రతీ యింట్లోనూ పిల్లలు తల్లిదండ్రుల్ని శాపనార్థాలు పెడ్తున్నారు… పెద్దవాళ్ళా పశ్చాత్తాప పడుతున్నారు మీ అన్నలాగా… నాకయితే కొననందుకు బాధా లేదు, దిగులూ లేదు…
అదంతా అట్టుంటే యిప్పుడు మేనకూర్లో మా తమ్ముడికున్న పదెకరాల మెట్ట మీద పడింది వీళ్ళ కన్ను… నీకెప్పుడూ ఏమీ ఇవ్వలేదు కదా నీ
పేరుతో కొంత రాయించుకురాపో అని గొడవ… ఏం చేసేది పుష్పా”
కాళ్ళు చాపుకుని సరిగ్గా కూర్చుంటూ మళ్ళీ అంది వదిన.
”మేనకూర్లోనే కదా టెక్స్‌టైల్‌ పార్కొచ్చింది” అడిగాన్నేను.
”అవునవును! అందుకే కదా అందరికీ నేలల మీద ప్రేమొచ్చింది. వాడేదో ముగ్గురాడపిల్లలతో సరయిన ఉద్యోగం లేక, పంటలు పండక నానా
యిబ్బందులూ పడ్డాడు యిన్నాళ్ళూ… అప్పుడు మేమేమయినా సాయం చేశామా? ఈ వయసులో యిప్పుడెళ్ళి మా తమ్ముడ్ని నాకు నేల రాసివ్వమంటే ఏమయినా పద్ధతిగా వుంటుందా?”
అస్సలు బావుండదన్నట్లుగా కళ్ళూ, తలా ఆడించాన్నేను.
”ఇన్నాళ్ళూ యింటి కోసం, పిల్లల కోసం బతికేశాను పుష్పా. యింకెన్నాళ్ళుంటానో తెలీదు… ఈ మిగిలిన కాలం నాకోసం నేను జీవిద్దామనుకుంటున్నాను… ఇది మీ అందరికీ విచిత్రంగా అన్పించొచ్చు… ప్చ్‌” ఏం చేయలేనన్నట్లుగా చేతులూపింది వదిన.
అందంగా యింగ్లీషు ‘యు’ ఆకారంలో కత్తిరించబడ్డ వదిన జుట్టు మెల్లిగా తిరుగుతోన్న ఫ్యాను గాలికి తెల్లటి మెడ మీద అల్లరి నాట్యం చేస్తోంది…
నీలిరంగు పూతలున్న లేత కాషాయరంగు ఇటాలియన్‌ క్రేప్‌ చీర వదిన మాట్లాడుతోంటే మీగడ తరకలా కదులుతోంది మెత్తగా… తను సహజంగానే
అందగత్తె… యాభయ్యేళ్ళ వయసులో యిప్పుడు మరింత అందంగా కన్పిస్తోంది.
నా చూపుల్ని గమనించిందో ఏమో…
”ఏ చీర కట్టుకున్నా ఈ చీర నీకెందుకంటారు పుష్పా… నేను కట్టుకోగలిగిన వయసులో ఏ పొద్దూ నా కోసం ఒక మంచిచీర కొనుక్కున్నదాన్ని కాదు. ఏది అందంగా కన్పించినా పిల్లల కోసం దాచేసేదాన్ని… ఇప్పుడు వెసులుబాటున్నా వయసులేదని వారిస్తున్నారు… జుట్టంతా వూడిపోయి సన్నగా, పీసులాగా వేళ్ళాడుతూంటే పార్లర్‌కెళ్ళి కట్‌ చేయించుకున్నానని ఎంతెంత గొడవయిందనుకున్నావ్‌ యింట్లో… నీకీ వయసులో పోనీ కావాలా…ఎక్సర్‌సయిజులు కావాలా అంటూ రచ్చరచ్చ… నేను యోగా చేసి ఆరోగ్యంగా వుంటే వీళ్ళకే మంచిది కదా…
అన్నింటికీ ముసల్దాన్ని… మరి చాకిరీ చేయడానికి మాత్రం కాదా? పెద్దదెక్కడో దూరంగా వుంది… యిది దగ్గర్లో రేణిగుంటలోనే వుంది కదాని,
ఉద్యోగస్థురాలు కదాని ఎంతెంత సేవ చేస్తున్నాను… చింటూగాడికి స్కూలు కెళ్ళేదాకా కూడా వాడి తల్లెవరో తెలీదు… అయినా సరే వీణ, ఇంద్ర యిద్దరూ మీ అన్నతో కలిసి ఎంతెంత సాధిస్తున్నారో తెలుసా?…
వదిన ఏడవడం లేదుగానీ పరిమితిని మించి గాలి నింపిన బెలూన్లా పగలడానికి సిద్ధంగా వున్నట్లుంది… వదినతో నేను కలిసి గడిపిన రోజులు
రాత్రి కురిసిన వర్షం తాలూకు జ్ఞాపకాల్లా యింకా చెరిగిపోనేలేదు.
వదిన యింటిని ఎంతో అందంగా సర్దేది… వాకిట్లో రాలిన పొగడ పూలతో అందమైన గ్రీటింగ్‌ కార్డులు తయారుచేసి ఆత్మీయులకు పంపేది…
ఆ పూలతోనే బుల్లిబుల్లి పళ్ళాలు చేసి ప్రతీ గదినీ పరిమళాలతో నింపేది…
చాలీచాలని అద్దె యింట్లో కూడ చిన్న చిన్న కుండీల్లో గులాబీ మొక్కల్ని పెంచేది… అవి మొగ్గ తొడిగినపుడూ, రంగులు రంగులుగా విరిసి
గుభాళిస్తున్నపుడూ తెగ మురిసిపోయేది…
అంత పనిలోనూ తీరిక చేసుకుని వాల్‌పెయింటింగ్‌లు తయారుచేసేది…
నెల్లూరు టౌన్‌ హాల్లో ‘రాజసింహ చిత్రకళా ప్రదర్శన’లో పెట్టేది… ఒకటి, రెండుసార్లు బహుమతులని, అనేకసార్లు ప్రశంసలని పొందాయి వదిన వేసిన పెయింటింగ్స్‌… అప్పుడు నయన, వీణ తల్లినెంతగానో అభినందించేవాళ్ళు.
మరి వీణ ఎందుకింతగా మారిపోయింది… దీని వెనుక ఇంద్ర హస్తం వుందని తెలుస్తూనే వుంది… ఒక్కసారిగా అందరి జీవితాల్లోకీ తోసుకొచ్చిన
డబ్బు, అపరిమితమైన సౌకర్యాలూ… చూస్తుండగానే అలవిగాని మార్పులూ, ఇవన్నీ తమ జీవితంలో కరువయిపోతున్నాయన్న అక్కసు… దీనికంతా ఎవరో ఒకర్ని నేరస్థుల్ని చేసి దుయ్యబడితేనే తప్ప మనశ్శాంతి దొరికేలా లేదు వీళ్ళకి…
అందుకే వదిన స్వస్వరూప జ్ఞానాన్ని నిందిస్తూ శునకానందాన్ని పొందుతున్నారు.
వీణలోని అసహనానికీ, ఫ్రస్ట్రేషన్‌కీ కారణాలను వెదుకుతూ ఏ విధంగా నచ్చచెప్పడమా అని ఆలోచనలో పడ్డాను.
చాలాసేపు మౌనంగా నా ఆలోచనల వెంట పరిగెడుతూంటే నాకు నిద్రొస్తూందనుకుందో ఏమో వదిన మెల్లిగా మంచం మీద ఒరిగి కళ్ళు మూసుకుంది. నేను కూడా మెల్లిగా లేచి కర్టెన్లు సరిచేసి, బెడ్‌లైటార్పి మంచం మీద వాలాను. అప్పటికి తొలికోడి కూస్తోంది…
  
నేను నిద్ర లేచే టప్పటికి చాలా పొద్దెక్కింది…
మందపాటి ముదురు రంగు తెరల్లో నుండి కూడా తన చురుకైన కిరణాలతో పొడుచుకొచ్చి నిద్రలేపాడు సూర్యుడు…
నేను తిరిగి వెళ్ళాల్సిన రోజు యిదే… మెత్తటి దిగులు మనసంతా వ్యాపించి గుండెను కలుక్కుమన్పించింది…
సాయంత్రం ఆరింటికి ట్రెయిను… నేను నేరుగా వచ్చేయడంతో అన్ననింకా చూడలేదు… వదినతో మాట్లాడి యిద్దరం కలిసి కాళహస్తికి వెళ్ళి
అన్నని చూసి అక్కడే ట్రెయిను పట్టుకోవాలి…
మెలకువ వచ్చిన తర్వాత కూడా చాలాసేపు లేవబుద్ధి కాలేదు… ఎక్కడా ఏమీ అలికిడి లేదు… ఇంద్ర, వీణ ఎవరి పనులకు వాళ్ళు
వెళ్ళిపోయినట్టున్నారు… వదిన ఏం చేస్తోందో… మళ్ళీ కళ్ళు మూసుకుని వుండిపోయాను చాలాసేపు…
హాల్లోని కోయిల గడియారం కుహు కుహుమంటూ పదకొండుసార్లు అరిచింది… ఇక తప్పదన్నట్లుగా లేచి మొహం కడుక్కుని కాఫీ కలుపుకుందామని వంటగదిలోకి వెళ్ళబోతూ వదినేం చేస్తోందాని కలియశాను…
ఏదో కొత్త పెయింటింగ్‌ మొదలుపెట్టినట్లుంది… లేదా యిదివరకే మొదలుపెట్టిందో గానీ చాలా లోతుగా లీనమయి వుంది…
”ఇంత ఒత్తిడిలో కూడా వదినకి మూడ్‌ ఎలా కుదుర్తుంది?” ఆశ్చర్యపోతూనే వంటగదిలోకి వెళ్ళి రెండు కప్పుల కాఫీ కలుపుకుని వదిన దగ్గరికెళ్ళాను…
అప్రయత్నంగా కాన్వాస్‌ కేసి చూసిన నాకు రెప్పలాడలేదు… బహుశా పెదవులు కూడా విడివడి వున్నాయేమో…
వినీలాకాశం కింద చాలామంది స్త్రీలు… అంతా కూడా నలభయి అయిదు, యాభయి వయసువాళ్ళే… ఒకరి చేతులొకరు పట్టుకుని గుండ్రంగా నిలబడి నాట్యం చేస్తున్నారు. చిత్రం ఎంత సహజంగా వుందంటే అంతా నిజంగానే వచ్చి ఎదురుగుండా నిల్చున్నారా అన్నంత సహజంగా వుంది.
అప్రతిభురాలినై నిల్చుండిపోయాను.
అలా ఎంతసేపు గడిచిందో గానీ కాఫీ చల్లారిపోతోందన్న స్పృహ కలిగి దగ్గరగా వెళ్ళి వదినకి కప్పందిస్తూండగా రెప్ప పడని నా కనుగుడ్లు ఆ
చిత్రానికి కింద రాసి వున్న అక్షరాల వెంట పరిగెత్తాయి…
”మనల్ని ప్రేమించి ప్రేమించీ
మృత్యువుకు దగ్గరవుతోన్న అమ్మల్ని ప్రేమగా
సీతాకోక చిలుకల్లా ఎగరనిద్దాం…
ప్రేమగా బతికించుకుందాం…”
ఆ అక్షరాల వెంట పరిగెత్తిన నా కనుగుడ్ల మీద పల్చటి నీటిపొర.
శీతాకాలపు మధ్యాహ్నపుటెండ కిటికీలో నుండి పల్చగా చిత్రం మీద పడి నా కళ్ళల్లోకి పరావర్తనం చెంది తళతళలాడుతోంది… ఆ తళతళ నా గుండెల్నిండా నిండిపోయింది…
ఇంక వదినతో మాట్లాడాల్సిందేమీ లేదు…
మూడు రోజులుగా ప్రశ్నల పుట్టలా వున్న నా మెదడుకి వేల సమాధానాలనిస్తూ నా ఎదురుగా నిలబడి వుందా చిత్రం…
నాక్కావాల్సిందేదో కూడా నాకు బాగా అర్థమయినట్లన్పించింది.
——–

శ్రీమతి వి. ప్రతిమ గారి గురించి…
కుమారి వి ప్రతిమ
తెలుగునాట స్థిరంగా బలపడిన స్త్రీవాద స్వర రచయిత శ్రీమతి వి. ప్రతిమ. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ప్రతిమ 1989 నుడి కథా, కవితారచన చేస్తున్నారు. సామాజిక బాధ్యత, సాహిత్య బాధ్యత ఏమిటో తెలిసిన వీరు ఇప్పటి వరకు దాదాపు 90 కథలు, 50 వరకు కవితలు వ్రాశారు. 2004లో వెలువరించిన ”పక్షి” కథా సంపుటి వీరికి మంచి పేరు తెచ్చింది. 1993 నుంచి 2007 వరకు పలు కథా పురస్కారాలు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం, ఆటా (న్యూజెర్సీ) చాసో స్ఫూర్తి అవార్డు, తానా, ఆంధ్రప్రభ, సాహిత్యనేత్రం (2007) కథా
పురస్కారాలు పొందడం విశేషం. అలాగే దాదాపు రెండు దశబ్దాల పాటు వీరి సాహిత్య సేవకు గుర్తింపుగా కడప జిల్లా నందలూరు కథానిలయం ఏర్పాటు చేసిన ”డా. కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కారం” 15 జులై2007న అందుకున్నారు.

Leave a Comment

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో