కవి మానవ పవ్రృత్తులకు దర్పణం – బెజవాడ గోపాలరెడ్డి
చూడ కళ్ళకు నిండైనరూపం… మాటలో, నడకలో, వ్యవహారంలో రాచపురుష లక్షణం… భావుకతలో ఉర్దూకవుల తీరు… ఆలోచనలలో అత్యాధునిక యోచన… రాజకీయంలో నాటి స్వాతంత్య్ర సమరయోధ వదిలివెళ్ళిన పాదముద్రలు… ఇవన్నీ కలబోస్తే సాహిత్య సాంస్కృతిక రాజకీయాల మేలు కలయికైన బెజవాడ గోపాలరెడ్డి అవుతారు. ఆగస్టు 5, 2007 ఆయన శతజయంతి. బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, ఒరియా, మరాఠీ, ఉర్దూ, తెలుగు మొదలైన 11 భాషలలో అభినివేశం – ఆయన బహుభాషా మూర్తిమత్వం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో జన్మించిన బెజవాడ గోపాలరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమైంది. ఆయన దేశస్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 29 ఏళ్ళలోనే ఎమ్మెల్యే, వెంటనే మినిష్టర్ ఏకకాలంలో నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిపోయాయి.
రవీంద్రనాధటాగోర్ స్థాపించిన శాంతినికేతన్‌లో వ్యక్తిత్వం సంతరించుకున్నారు బెజవాడ గోపాలరెడ్డి. టాగోర్ ఆయనకు ప్రాణం. టాగోర్ శిష్యురాలు లక్ష్మీకాంతమ్మ. ఆమెను పెండ్లి చేసుకున్నారాయన. పెళ్ళిరోజు టాగోర్ పుట్టినరోజైన మే 8వ తేదీని నిర్ధారించుకున్నారు. పగలంతా అవిశ్రాంతంగా పని. దీనితో ఆ రోజు సాయంకాలం 5 గంటలకు పెండ్లి జరిగింది. ఆ పెళ్ళికి పురోహితునిగా మాలపల్లి నవలా రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు రావడం, తరువాత జరిగిన పెళ్ళి సందర్భ కవి సమ్మేళనంలో శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, గవర్నర్ ఇలా ఒకపాయగా రాజకీయ జీవితం సాగగా… మరోపాయగా కవిగా, రచయితగా బెజవాడ గోపాలరెడ్డి జీవితం సాగింది. ఒక్కమాటలో చెప్పాలంటే – జీవితంలో ప్రతికోణం వైవిధ్యం… పురోగమనమే. ఆయన్ను సాహిత్యనేత్రం ఎడిటర్ శశిశ్రీ 1996లో నెల్లూరులోని ఆయన ఇంటికెళ్ళి కలిశారు. (ముందే ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కుదుర్చుకుని వెళారు. కాఫీఫలహారాలు అయ్యాక… ఆయన వచ్చారు. పరస్పరం నమస్కారాలు పరిచయాలు అయ్యాక) ”ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారో…!” అన్నారు గోపాలరెడ్డిగారు.
”సాహిత్యనేత్రం పత్రికకు మీ ఇంటర్వ్యూ కావాలని వచ్చాను” (‘ఈ విషయం చెప్పించే కదా వచ్చా… మళీ ఇలా అడుగుతారేంటి ఈయన’ మనసులో అనుకుంటూ) వినయంగా చెప్పాను.
”ఈ సంవత్సరం సాధ్యం కాదు. వచ్చే సంవత్సరం చూద్దాం. సరేనా?” తాపీగా అన్నారు.
నాకు లోలోపల అసహనం, కోపం కలిగాయి. పెద్దాయన కదా! ఏం చేస్తాం!! ఒక సంవత్సరం తర్వాత రమ్మంటున్నారు – ఆ విషయం ముందే చెప్పి ఉంటే వ్యయప్రయాసలు తప్పేవి కదా అనుకున్నాను. ఇంక చేసేది ఏం లేక చేదు గుటికలు మింగుకుంటూ… ”అట్నే సార్… మరి నేను పోతాను…” అని లేచి నిలబడ్డాను.
నా మొహంలో గిర్రున మారిపోయిన రంగుల్ని గుర్తించినట్లుంది కాబోలు. వెంటనే అన్నారు ”వచ్చే సంవత్సరం అంటే నీకు అర్థం కాలేదు కదూ!” అన్నారు కళ్ళలోకి సూదంటుగా చూస్తూ.
”లేదు. అర్థం కాలేదు” అన్నాను.
”ఈ రోజుతో ఈ సంవత్సరం ఆఖరు. రేపు ఉదయమే రా. రేపు తెలుగు సంవత్సరాది మొదటిరోజు… సరేనా!!” చిక్కుముడి తీస్తూ అన్నారు.
ఆ మాటలు నాకు చాలా రిలీఫ్‌ని ఇచ్చాయ్. ఆరిపోయిన బల్బు మళ్ళీ వెలిగినట్లు అయింది నా మొహం. ”చాలా సంతోషం సార్… నాకు రేపు ఉగాది అనే సంగతి గుర్తులేదు” అని నవ్వేసి వచ్చి – ఆ మరుసటిరోజు అదే ఉగాది మొదటిరోజు ఆ పెద్దాయనతో ఇంటర్వ్యూ చేశాను. ఆ సంగతులు మీ కోసం… చదవండి – అనుభూతించండి.. – శశిశ్రీ

ప్రశ్న : సాహిత్యరంగంలో మీ ప్రవేశానికి నేపథ్యం యేమిటి? మీ తొలి రచనయేది – దాని ప్రేరణ యేమిటి? ఇప్పటి వరకు మీ రచనలు యెన్ని గ్రంథస్థమయ్యాయి?
సమాధానం : నేను కవితాసభలోకి చాలా ఆలస్యంగా వచ్చాను. నాకు డెబ్బయి యేళ్ళు నిండుతున్నప్పుడు కవితారచన 1977 మే నెలలో ప్రారంభించాను. అంతకుముందు అనువాదాలు చేస్తుండినాను.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు… పలు భాషలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులతో పరిచయాలు కలిగాయి. రవీంద్రనాథ్ టాగూర్ సాహిత్యం నన్ను బాగా ప్రభావితుణ్ణి చేసింది. అవన్నీ నా కవితారంగం ప్రవేశానికి నేపథ్యం. నా తొలి కవిత శీర్షిక ‘తాజ్‌మహల్’. తాజ్‌మహల్‌ను అనేక విధములుగా పోల్చుకున్నాను. అది దీర్ఘకవిత, ‘కాలవాహిని’ అనే నా పుస్తకంలో ముద్రించాను. షాజహాన్ చక్రవర్తి తన కొడుకు చేతుల్లో బందీ అయి, చెరసాల పాలయ్యాడు. ఆ చెరసాల నుంచి ఎప్పుడూ తన ప్రేమ మందిరమైన తాజ్‌మహల్‌నే చూచేవాడు. చివరి దినాల్లో షాజహాన్ తన ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌ను చూస్తూనే కన్నుమూశాడు. నేను కూడా ఆ అనుభూతిని వూహించాను. పలుమార్లు తాజ్‌మహల్‌ను సందర్శించాను. అలా సందర్శించిన అన్ని సందర్భాల్లోనూ తాజ్‌మహల్ నాకు అనేక విధాలుగా అనుభూతులకు అవకాశమిచ్చింది. ఇప్పటివరకు ఇరవై రెండు సంపుటాలుగా నా రచనలు వచ్చాయి. అవి మూడు భాగాలు దీర్ఘకవిత, ముక్తకాలు, రేఖాచిత్రాలు – చంధస్సు రాదు నాకు. తెలుగు సాహిత్య మర్యాదలు నాకు బాగా తెలియవు. స్వచ్ఛందంగా వచనంలోనే నా భావాలను ఆవిష్కరించాను.
ప్రశ్న 2 : ‘కవి’ గురించీ కవిత్వం గురించిన మీ అభిప్రాయాలేమిటి?
సమాధానం : కవిత్వం అధ్యయనం కోసమే. అనుభవించడం కోసం కాదు. ఇంతకూ కవి రాసేది ఎవరి కోసం? ఆత్మానందం కోసమా? సమకాలీనుల కోసమా? ఆధునికుల కోసమా? శాస్త్ర పూజారుల కోసమా?
కవితలో వాస్తవికత కన్నా, బుద్ధికన్నా, కల్పనే మెండుగా వుండాలి. ఊహల తుషారంలో కనిపించే అందం కవితానందానికి మూలకందం. కవి కెమెరామెన్‌కాడు. చిత్రకారుడూ కాడు. అగోచరమైన ఊహను అందంగా పదాల్లో పొదివే నేర్పరి. అందువల్లనే కవి మానవ ప్రవృత్తులకు దర్పణం కాగా, తాను సృష్టించే వూహలకూ కల్పించే భ్రమల సంకేతాలకూ మాత్రమే దర్పణమౌతాడు.

ప్రశ్న 3 : మీ బాల్యం, మీ విద్య గురించిన ముఖ్యంగా రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన శాంతినికేతన్‌లో జరిగింది కదా! ఆనాటి విశేషాలు, మీ అనుభవాలు యేమిటి?
సమాధానం : నేను వెంకటగిరిరాజావారి హైస్కూలులో ఫోర్త్‌ఫారం చదువుతున్న రోజుల్లో 1921 జనవరిలో గాంధి ‘సహాయ నిరాకరణ’ పిలుపునిచ్చారు. నేను గాంధిగారి పిలుపున సర్కారు బడి వదిలాను. తర్వాత బందర్‌లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో చేరినాను. అక్కడ మూడున్నర సంవత్సరాలుండి రవీంద్రనాధ్‌టాగూర్ స్థాపించిన విశ్వభారతి (శాంతినికేతన్)కి పోయాను. అప్పుడు టాగూర్ జీవించే వున్నాడు. ఆ కాలంలోనే ఆయన సాహిత్యం బాగా చదివాను. ఆయన నాపై పెద్ద ప్రభావం వేశాడు. 1924 నుండి 1927 వరకు అక్కడే వున్నాను.
విశ్వభారతి వాతావరణం అంతా స్వేచ్ఛా పూరితమైందే! ఆటలు, పాటలు, చదువు అంతా… యెంతో ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో ప్రకృతి ఒడిలో చదువుకున్నాను. విశ్వభారతి తోటల్లో – చెట్లెక్కి ఆడుకునేవాళ్ళం కూడా. ఆ చదువులు ఆ సంధ్యలు వేరు. నేను యే యూనివర్శిటీకి చెందినవాణ్ణి కాను. మీలా బి.ఏ., బి.కాం., డిగ్రీలు నాకు లేవు. డిగ్రీ కొలతల చదువులు కావు మావి. విశ్వభారతిలో చదువుకుంటున్న దినాలలోనే ఒరిస్సాకు చెందిన నవక్రిష్ణచౌదరి, బెంగాలీ ప్రాంతానికి చెందిన మాలతిసేన పరిచయమై, స్నేహితులమయ్యాము. వారు నా సహచర విద్యార్థులే! బెంగాలీ మహిళ అయిన మాలతిసేన ఒరియావాడైన నవక్రిష్ణ చౌదరిని పెండ్లి చేసుకుంది. చౌదరి ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మాలతిసేన బిసిల కోసం ఆ రోజుల్లో చాలా కష్టపడి పనిచేసింది.
ప్రశ్న : సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా మీరు చేసిన సాహితీ సేవ గురించి వివరించగలరు.
సమాధానం : 25 సం||లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షునిగా ఉండినాను. పాత ప్రబంధాలను, ఎన్నో కావ్యాలనూ చాలామంది పాఠకులు కొని చదివేందుకు వీలుగా తక్కువ ధరలకు ముద్రించి అందించాము. ఎన్నో విలువైన గ్రంథాలు 300కు పైగా వెలువరించాము. ముఖ్యంగా చేనేత, కుమ్మరి మొ|| వృత్తి పనివారలకు సంబంధించిన పదకోశాలను సాహిత్య అకాడమీ ప్రచురించడం విశేషం.

ప్రశ్న : అకాడమీలన్నీ తెలుగు విశ్వవిద్యాలయంలో లీనమైపోవడాన్ని గురించి మీ అభిప్రాయం తెల్పగలరు.
సమాధానం : శ్రీ రామారావుగారి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వివిధ అకాడమీలు తెలుగు విశ్వవిద్యాలయంలో కలిపేశారు. కానీ లలితకళలకు సంబంధించి, దేనికదే విడివిడిగా ఒక అకాడమీ ఉంటే ఎంతో మంచిది. అలా ఉండగలిగితే, లలిత కళలు అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. అటువంటి ఏర్పాట్లు మళ్ళీ జరిగితే చాలా సంతోషం. అలా ఏర్పడితే ఆ అకాడమీలకు ప్రభుత్వ ఉద్యోగులు అధ్యక్షులుగా ఉండకూడదు. నాన్ అఫీషియల్ అభ్యర్థులు అధ్యక్షులుగా ఉంటే కొంచెం పని జరుగుతుంది.
ప్రశ్న : విశ్వకవి రవీంద్రుని ప్రియశిష్యునిగా, బెంగాలీ భాష లోతుపాతులు తెలిసిన మీరు, అఖిల భారత ఠాగూర్ సెంటినరీ కమిటీకి కార్యదర్శిగా ఉండిన కాలంలో మీ కృషి గురించి తెల్పగలరు.
సమాధానం : రవీంద్రనాధ్‌టాగూర్ శతజయంతి జరిగిన కాలంలో పండిట్‌నెహ్రూ, రాధాకృష్ణ, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా అఖిల భారత సెంటినరీ కమిటీ ఏర్పడింది. నేను కార్యదర్శిగా, అలాగే రెవిన్యూ సివిల్ ఎక్స్ పెండిచర్‌లో కోశాధికారిగా పనిచేశాను. అపుడు దేశంలోని ప్రతి రాష్ట్రంలో, రవీంద్రుని పేరిట ఒక రంగస్థలాన్ని ఆర్థిక సహాయం ఇచ్చి నిర్మించేందుకు దోహదపడ్డాను. ఒక్క మద్రాసులో తప్ప, ‘కాశ్మీరు’ మొదలు తిరువనంతపురం వరకూ, అన్ని రాష్ట్రాలలో ఈనాడు రవీంద్రభారతి వంటి రంగస్థలాలు నెలకొన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 36 లక్షల రూ||ల ఖర్చుతో ‘ఆరుబయలు రంగస్థలం’ ఈ కమిటీయే నిర్మించింది. హైదరాబాదులోని ‘రవీంద్ర భారతిని’ నాడు సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నకాలంలో నేనే కేంద్రమంత్రిగా వచ్చి శంకుస్థాపన చేశాను.
ప్రశ్న : దేశంలో అత్యున్నతమైన సాహితీపురస్కారం ‘జ్ఞానపీఠ్‘ అవార్డు. ఆ అవార్డు కమిటీకి మీరు అధ్యక్షునిగా ఉన్నపుడు చేసిన సేవ గురించి చెప్పండి.
సమాధానం : ప్రముఖ పారిశ్రామికవేత్త ‘శాంతిప్రసాద్ జైన్’ భార్య రమాజైన్ 1965లో ‘జ్ఞానపీఠ్’ అవార్డు కమిటీని ఏర్పాటు చేసింది. మనదేశంలోని భాషల్లో, ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించే గొప్ప ఆశయంతో ‘జ్ఞానపీఠ్’ సాహితీ బహుమతి ఏర్పాటైంది. బహుమతి పొందిన సాహిత్యకారునికి ఒకటిన్నర లక్షల రూ||ల నగదును, సరస్వతీదేవి విగ్రహాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేసి, ఈ కమిటీ సన్మానిస్తుంది.
ప్రతి సం|| ఒక రచయితకు మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. ఆ కమిటీకి నేను అధ్యక్షునిగా ఉండటం ఒక విశేషమైతే, నేను అధ్యక్షునిగా ఉన్న కాలంలోనే తెలుగువాడైన ‘విశ్వనాథ సత్యనారాయణ’ గారికి ‘జ్ఞానపీఠ్’ అవార్డు లభించడం మరో విశేషం. ఇది నాకు తృప్తినిచ్చిన విషయమేగాక నా సాహితీ జీవితంలో మరిచిపోలేని సంఘటన. పి.వి.నరసింహారావు అధ్యక్షునిగా ఉన్నపుడు తెలుగువాడైన సి.నారాయణరెడ్డికి ఈ అవార్డు లభించడం తెలిసిందే. తెలుగులో ఇప్పటికి ఈ ఇద్దరికే ఈ అవార్డు లభించింది. అదే కన్నడ, మలయాళ భాషలలో నలుగురైదుగురికి వచ్చాయి. తెలుగులో ఈ పురస్కారం పొందే అర్హులు ఉండీ ఈ అవార్డు రాకపోవడం బాధాకరం. ఉదాహరణకు దేవులపల్లి కృష్ణశాస్త్రి, గుడిపాటి వెంకట చలం, పుట్టపర్తి నారాయణాచార్యులు, గడియారం వేంకట శేషశాస్త్రి ఉన్నారు. అయినా వారికి ‘జ్ఞానపీఠ్’ అవార్డు రాలేదు.
ప్రశ్న : ఆధునిక తెలుగు కవిత్వానికి ‘దీపధారులు’ అనదగ్గ కవులు మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? శ్రీశ్రీ గురించి మీ అభిప్రాయం.
సమాధానం : నేను ‘శ్రీశ్రీ’ని అంతపెద్ద స్థానానికి ఒప్పుకోను. ‘మహాప్రస్థానం’లో ఎక్కువ పద్యాలు నాకు అంత పెద్దగా నచ్చలేదు. భావాలు గంభీరంగా లేవు. నా దృష్టిలో గుంటూరు శేషేంద్రశర్మ, నారాయణరెడ్డి, నారాయణాచార్యులు నిలుస్తారు. అలాగే, చాలామంది కథలు రాసేవాళూ ఉన్నారు. వాళ్లలో కొత్తగా రాస్తున్న వాళ్లలో కేతు విశ్వనాథరెడ్డి పేరు తప్ప వేరే పేర్లు గుర్తురావడం లేదు. అలాగే భావకవిత్వంలో కొందరిపేర్లు చెప్పగలనుగానీ, భావ కవిత్వ దినాలు పోయాయనుకోండి.
ప్రశ్న : తెలుగేతర భాషలు మీకు ఏవేవి తెలుసు? ఆ భాషా కవుల సాహిత్యంతో మీ పరిచయాలు, అనుభూతులు తెల్పగలరు.
సమాధానం : ఇతర భాషలన్నీ నేర్చుకోడానికి ప్రయత్నించాను. నేను విశ్వభారతి విద్యార్థిని. 1924 నుండి 1927 వరకు అక్కడే నా చదువు సాగింది. జైల్లో ఉన్నప్పుడు తమిళం, కన్నడం నేర్చుకున్నాను. ‘విశ్వభారతి’లో ఉన్నపుడు బెంగాలీ నేర్చుకున్నాను. ‘పూనా’లో మరాఠీ నేర్చుకున్నాను. అలాగే అస్సామీ, ఒరియా, మరి అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నపుడు ఉర్దూ నేర్చుకున్నాను. అంటే… నేర్చుకోవడానికి ప్రయత్నించినాను. దేంట్లో కూడా సిద్ధి పొందలేదు. తెలుగులో కూడా పెద్ద అధికారం లేదు. ‘తిరుచునాపల్లి’ జైలులో ఉన్నపుడు అక్కడ కొందరికి ‘బెంగాలీ’ నేర్పాను. అనంతశయనం అయ్యంగార్, సంతానం, కల్యి, విద్వాన్ విశ్వం మొ||వాళ్లకు బెంగాలీ నేర్పి, వాళ్లకు రవీంద్రుని గురించి బెంగాలీలో పరిచయం చేశాను. ‘బళ్లారి’ అల్లీపురం జైళ్లలో నాడు జనతామంత్రిగా ఉండిన రవీంద్రవర్మ వగైరాలకు రవీంద్రుని పాటలను నేర్పించాను. ఉర్దూలో ‘గాలిబ్’, ‘ఇగ్బాల్’ అమితంగా నాపై ప్రభావం చూపారు. ఆ ఇద్దరి సాహిత్యం బాగా చదువుకున్నాను. ‘గాలిబ్’ కవిత్వాన్ని ‘ప్రేమశతకం’ పేరుతోను, ‘ఇగ్బాల్’ కవిత్వాన్ని ‘ఆత్మశతకం’ పేరుతో తెలుగులో అనువదించి పుస్తకంగా ముద్రించాను.
రవీంద్రుని ప్రభావం నాపైన చాలా పెద్దది, గొప్పది. ఆయనను ‘ఆక్స్‌ఫర్డ్’ వారు ఒక ప్రత్యేక స్నాతకోత్సవం జరిపి Myriad-Minded Genius అని సత్కరించారు. సర్వకళా ప్రపూర్ణుడాయన. కాళిదాసు తర్వాత ఇంతటి మహాకవి భారతదేశంలో జన్మించలేదని నా విశ్వాసం. 1913లో రవీంద్రుని ‘గీతాంజలి’కి సాహిత్య నోబుల్ బహుమతి ఇచ్చారు. దీనితో భారతీయ భాషలకు ఒక ప్రాముఖ్యం వచ్చింది. అప్పటివరకూ సంస్కృతంలోనే ఉండిన ప్రాముఖ్యం దేశభాషలకు సంక్రమించినట్లయింది.

ప్రశ్న : తెలుగు సాహిత్యరంగంలోని ‘విమర్శ’ ప్రక్రియలో ‘రాచమల్లు రామచంద్రారెడ్డి‘ని ఉత్తమస్థాయి విమర్శకునిగా పేర్కొంటారు. ఆయన గురించి మీ అభిప్రాయం.
సమాధానం : రాచమల్లు రామచంద్రారెడ్డి అరుదైన సాహిత్య విమర్శకుడు. ఆయన చేసిన కృషిని హర్షిస్తున్నాను. ”సంవేదన”, ”సవ్యసాచి” పత్రికల ద్వారా గొప్ప సాహిత్య సేవ చేశాడు. అటువంటి విమర్శకుల అవసరం ఇప్పుడు ఉందా? అంటే ఉంది మరి.
ప్రశ్న : కవి, రచయిత తన కలం చెప్పేదానికీ, తాను నిజంగా జీవిస్తున్న దానికీ సంబంధం ఉంటున్నదా? మాటకు, చేతకు సామ్యం ఉండాలని కోరుకోవడం ఎంతవరకు సబబు?
సమాధానం : ఈ ప్రశ్న మొదటినుంచీ ఉండేదే! కొత్తగా వచ్చిందికాదు. ‘జీవితం – రచన’ రెండూ వేరు వేరే! ఇది మానవ ప్రకృతిలోనే ఉంది. చెప్పిందంతా జీవితంలో చూపించలేదు.
ప్రశ్న : ‘సార్వకాలీన, శాశ్వత’ విలువల సాహిత్యం అనేదాని గురించి మీ అభిప్రాయం ఏమిటో తెల్పగలరు.
సమాధానం : సూర్య, చంద్రుల మాదిరిగా ‘శాశ్వత సాహిత్యం’ ఉండాలని ఎందుకు కోరుకుంటారు? ‘సార్వకాలీనత’ కూడా అంతే. సమస్యలతో పాటు సాహిత్యం కూడా మారుతూ ఉంటుంది. ఆ విధంగా మారాల్సిన అవసరం కూడా ఉంది. ఒక సమస్య గురించి సాహిత్య సృష్టి ఏదైనా జరిగితే ఆ సమస్య పరిష్కారమైపోతే ఆ సాహిత్యం గమ్యం చేరినట్లే, సఫలీకృతం అయినట్లే, ఫలితం సాధించినట్లే. మనిషి జీవితం ఎప్పుడూ సమస్యలతోనే ఉంటుంది. సమస్యలు మారుతుంటాయి. ఒక సమస్య పోతే మరొక సమస్య పుట్టుకురావడం సహజం. అటువంటప్పుడు సాహిత్యం శాశ్వత విలువలతో ఎప్పటికీ సూర్యచంద్రుల మాదిరి ఎలా ఉంటుంది.
ప్రశ్న : ‘స్త్రీవాదం’, ‘దళితవాదం’ ఇటీవల తెలుగు సాహిత్యరంగంలో రంగప్రవేశం చేశాయి. వాటిని గురించి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

సమాధానం : ఎన్నో మార్పులొస్తున్నాయి. అలాగే సాహిత్యంలో కూడా మార్పులు రావడం సహజం. నేను వాటిని ఆహ్వానిస్తున్నాను. దళితులు మంచి చైతన్యంతో సమైక్యం కావడం, వారి కష్టాలనూ కన్నీళ్ళనూ సాహిత్యం ద్వారా తెలియజేయడం అందరూ ఆహ్వానించవలసిందే! స్త్రీవాదం గురించి నాకు పెద్దగా తెలియదు. ఒకటి మాత్రం చెప్పగలను భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. మనదేశం ఉనికి అనేది కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న కారణంగానే నిరాటంకంగా నిలబడగలుగుతోంది. కుటుంబవ్యవస్థ ‘వద్దు’ అనే స్త్రీవాదం ఏమిటో నాకు అంతగా అర్థం కావడం లేదు. సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఎంత అభివృద్ధి సాధించినా సంతోషమే. స్త్రీవాదం కుటుంబ వ్యవస్థను ‘వద్దు’ అని దెబ్బకొట్టాలనుకుంటే, అది స్త్రీ వాదానికే దెబ్బగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు.
ప్రశ్న : వర్తమాన కవులు, కథకులు, విమర్శకులకు మీరిచ్చే సందేశం ఏదైనా ఉందా?
సమాధానం : అక్కరలేదు. వారి మనోప్రవృత్తి ప్రకారం నడుచుకోవడమే మంచిది. ఒకరి సందేశాలతో, ఒకరి అడుగుజాడల్లో ఇంకొకరు నడవరాదు. ‘అప్పకవి’ ‘బాలవ్యాకరణం’ అడుగుజాడల్లో ఎందుకుండాలి. పాతను పొగుడుతూ కూర్చుంటే సరిపోతుందా? సాంప్రదాయపు మెట్లు గత కాలాల అడుగులకు చేరుస్తాయి. అవి భావిశిఖరాలకు ఎక్కించేవికావు. పెద్దలు నడిచిన కాలిబాటలలో నడుస్తూ పోవడం తేలికపని. కొత్త మాగాణాలలో కాలిబాటలు లేవు. అడుగుజాడలూ లేవు, ఎక్కిపోయే మెట్లూ లేవు. భవిష్యత్తు ఉదయించబోయేది, చీకట్లు పలచబడుతూ వస్తాయి. అట్టి ఉదయించబోయే సూర్యునికి స్వాగతం పలుకుదాం. అస్తమించే సూర్యుణ్ణి ఎంతకాలం పూజిస్తాం.
Vamsi M Maganti said,
October 29, 2008 @ 7:32 am
బావుంది శశిశ్రీ గారి ఇంటర్వ్యూ. ఇంకా మరికొన్ని భాగాలు ఉన్నాయేమో తెలియరాలేదు.
DR.Jonnalagadda Markandeyulu said,
December 7, 2009 @ 6:46 am
ఒక రాజకీయవేత్తగానేకాక తెలుగుసాహిత్యమునకు విలువైన సమాచారముగ “శశిశ్రీ -బెజవాడగోపాలరెడ్డి” – ఇంటర్వ్యూ సారాంశము భావితరానికి స్ఫూర్తిదాయకయ స్వతంత్ర,సారస్వతోదయప్రయత్నము చేసిన,చేస్తున్న,వారందరికీ సూర్యచంద్రులున్నంతకాలమూ ప్రేరణ కలిగించే అంశాలు కలిగి ఉంది.