సగం తెరిచిన కిటికీ
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్

చెరిగిపోని పాదముద్రల మీద
చరిత్రను చదవడం ఎంత అద్భుతమో
పుటలు తిప్పుతున్న చేతివేళ్ళ చప్పరింతల్లో
గతకాలపు రక్తపుమరకల “ఫింగర్‌ప్రింట్స్”
ఆనవాళ్ళను వెతకడం కూడా అంతే అద్భుతం!!
చదవడం కూడా ఒక సంయోగమైతే
పదానికి, పదానికి మధ్యగల శూన్యంలో
ఉనికిని నాటుకోవడమూ
వేలికి, పుటకు మధ్యగల స్పర్శసుఖంలో కన్నా
కంటిచూపు, అక్షరాన్ని సంధించడంలోని
అనుభవాన్ని అంచనా వేయడమూ అద్భుతమే!
రత్యానంతరము దొరికిన ఆనందాలను కొలవడం కాదు
సుఖాల అంచులలో వేళాడబడుతున్న
దుఃఖ కన్యకల భోగించడంలోని లాలసను అంచనా వేయడమంటే
కాలం వీపు మీద ప్రవహించే నదీ ప్రవాహంలో కొట్టుకుపోవడమే
* * *
తీరాన్ని తాకి దాటిపోలేని బలహీనత
అడిగితే ఎవరికేమి చెప్పగలం
మగతనపు అహంకారంలో
అలలుగా ఎగిసిపడే ముడతలు పడిన అనుభవాలను
అంచనా వేయలేకపోవడం మూర్ఖత్వంలోని అద్భుతం
ఇపుడు -
ఇసుకలో కుంగిపోతున్న పాదముద్రలు
సగం తెరవబడిన కిటికీలా
సగం మూయబడిన చరిత్రపుటలా
ఏమో!
దూసుకువస్తున్న వెలుగురేఖలు
ఇసుక నీడలలో సంగమించే దృశ్యాన్ని చూడటం కూడా
ఒక అద్భుతమే!!
bollojubaba said,
December 3, 2008 @ 6:54 am
కవిత అద్భుతంగా ఉంది.
Audisesha reddy. K. said,
December 5, 2008 @ 6:51 am
రూప్ కుమార్ గారూ.. చక్కటి కవితను ఆవిష్కరించారు. అభి నందనలు.
arun kumar Marapatla said,
April 6, 2010 @ 2:43 am
రూప్ కుమార్ గారు మీ కవిత చాలా బాగుంది.మంచి కవితనందించినందుకు అభినందనలు.