”అస్తిత్వానికి అద్దం పట్టిన స్వప్న శబ్దం”
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
‘హైకూ’ కవిగా కవితాలోకంలోకి అడుగిడిన ‘రూప్‌కుమార్ డబ్బీకార్’ ‘సంపెంగ లోలకం’ హైకూల సంపుటితో సాహిత్య పరిమళాల్ని పాఠకులకు పంచారు. ఇప్పుడు ‘స్వప్న శబ్దం’ కవితాసంపుటిలో పల్లె అనుబంధాల్ని ఆరవోశారు. ఆత్మగల కవిత్వాన్ని అందించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఆగమయిపోకుండా కాపాడుకోవాలనే తపనతో పిలుపునిచ్చారు. నిద్రాణమైయున్న తెలంగాణ యువతను తట్టిలేపే ప్రయత్నం చేశారు.
వేదనామయ గాయాల చుట్టూ ఆలోచనలను తిప్పి, ఎక్కడ బాధ, రుగ్మత వుందో వేలుబెట్టి చూపించినట్లు కవిత్వమై ప్రవహించిన కవి రూప్‌కుమార్. మానవతా బుద్ధికి, త్రికరణశుద్ధికి వీరు ప్రతీక. కవిత్వం మారే దశలు, దిశలు గ్రహిస్తూ తనదంటూ వో బాణీతో వచన కవిత్వానికి వన్నెచిన్నెలు కూర్చిన రూపశిల్పి రూప్‌కుమార్. వర్తమాన సంఘటనలనే కవితావస్తువుగా స్వీకరించి బలమైన అభివ్యక్తితో కవిత్వాన్ని పండించారు. వస్తువుపట్ల సమగ్ర పరిజ్ఞానం, విస్తృత అధ్యయనం ఉండటమే కాకుండా విశాల దృక్పథం గల భావాలు, ఎక్కడా తలవంచని వ్యక్తిత్వం, ఈ కవి సొత్తేమోననిపిస్తుంటుంది వీరి కవిత్వం చదువుతుంటే! పల్లె మూలాలను ప్రపంచీకరణ వేరుపురుగై ఏ విధంగా ధ్వంసం చేస్తుందో విపులీకరించారు. బతుకునిండా నిండిన భవిష్యత్ భయాలను దార్శనికంగా కళ్లకు కట్టించాడు కవి. ఈయన స్వానుభవాలు, సామాజికానుభవాలు ఎంత లోతైనవో కవిత్వంలోని వస్తు విస్తృతిని బట్టి పసిగట్టవచ్చును. శ్రమజీవి ఆనందమయంగా క్రమజీవిగా బతకాలనేదే వీరి ఆకాంక్ష.

మనిషి స్వప్నాలకు సుందరాకృతి నిచ్చిన వీరి ‘స్వప్న శబ్దం’లో మొత్తం 42 కవితలున్నాయి. ‘పల్లె కల’తో మొదలై ‘విషాదపు క్షితిజరేఖ’తో కవితలు ముగుస్తాయి. కవితాక్రమం లాగానే ప్రపంచీకరణ ఫలితంగా ‘పల్లె కల’ చివరకు ‘విషాదపు క్షితిజరేఖ’లుగానే కనిపించడం నిత్యసత్యం. ఒకనాటి పల్లెకు నేటి పల్లెకు ఉన్న పరిణామ క్రమాన్ని, నానాటికి దిగజారిపోతున్న పల్లెల సౌభాగ్యాన్ని కళ్ళకు కట్టించాడు ‘పల్లెకల’లో కవి. ఎన్నో ఆశలతో పల్లెను పలుకరించాలని బయలుదేరిన కవికి నిరాశే ఎదురైంది.
”పల్లె పొలిమేరల్లో గాలి విలాపరాగాలు / ఏటిగట్టున చిట్లిన నేల విషాదనేత్రాలు/ పల్లె చెక్కిళ్ళ మీద దీనంగా జారే కన్నీటిచుక్కలు / మోటబావుల మీద ముళ్ళ జెముడు దివిటీలు/… ఎడారి మండల పరదాల మాటున ఊపిరాడని స్థితిలో” పల్లె తల్లడిల్లుతూ కనిపిస్తుంది.
కవికి అంతఃచక్షువులు ఉన్నప్పుడే లోచూపు చూడగల్గుతాడు. అట్టి అంతఃనేత్రంతో పాఠకునికి వస్తుగుణాన్ని పట్టించినప్పుడే కవిత లక్ష్యం నెరవేరినట్లవుతుంది. ”కాయలుగాచే కళ్లు” కవిత చూడండి ఎంతటి లోతైన భావాల్ని కవి ఆవిష్కరించారో! ”కళ్ళున్నాయి కదాని / చూస్తున్నాననుకోకు / చూడగలిగే చూపులకు / అంతఃచక్షువుల నతికించేంత వరకూ/చూడగలుగుతున్నాననుకోకు / మనసుతో చూడలేనపుడు / కనబడేదంతా నిజమనుకోకు/… అలలను అంగవస్త్రాలుగా / దేహం మీద కప్పుకోవడమే గాదు / నీటి చుక్కల్ని ‘కాంటాక్ట్‌లెన్స్’లాగా చేసికొని మరీ చూడు/… చూపులేని గుడ్డివాడు / చూడటం లేదనుకోకు / కనుపాపల్ని గుండెల కతికించుకొని /మనసు వాకిట్లో ప్రమిదల్లా వెలిగించటం అతణ్ణి చూసి నేర్చుకో/ ……కళ్ళున్నాయి కదాని – కన్రెప్పలు తెరచి / మనసు మూసుకోకు/ ” అంటారు.
”ఎడారి నిప్పుల్లో నల్లగొండ” అనే కవితలో కవి నల్లగొండ జీవితాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టించాడు. ”కొండచెలిమ” ఓ కోనేరు/ కొండెక్కిన దీపమాయె/ తీయని జలధారలు / ….. కృష్ణా గోదావరులు/ …. అమ్మకంటి క్రింద ఎండిన / కన్నీటి చారల జాడలు / అవి గాయపడిన గుండె / దుఃఖాశ్రువుల ఆనవాళ్లు / … గాయాలు, గాయాలు / ఒళ్ళంతా దిగులు గాయాలు / కన్నీళ్ళు, కన్నీళ్ళు / కళ్ళలో పచ్చిపుళ్ళ పల్లేరు కాయలు /” అంటూ తెలంగాణ కన్నీటి కథలు ఈ కవితలో వినిపించాడు కవి.
”పోటు” అనే కవితలో కవి కమ్మరి జీవితాన్ని కష్టాల కడలితో పోలుస్తూ, కణకణ కాలే కొలిమికి జతచేసి, ఆకలి మంటల్లో శ్రమ, మాడిమసై ఆవిరయ్యే తీరును వర్ణించడం చెప్పుకోదగినట్లుగా ఉంది. ”ఇప్పుడు కాలేది కొలిమి కాదు నా కడుపు… పోటొచ్చి ఎగసిపడ్డ అలలు నా కంటి దాకా వచ్చి విరిగిపడతాయేమో… అందుకే నా కంటి నీరు కూడ ఉప్పునీరే /” అంటారు.
“భగ్న శిథిలాల్లో స్వర్ణ శకలాల్ని / గురిపెట్టే దూరాలను, దగ్గరికి లాక్కొనే / ఉపాయాలను వెతుక్కోవాలి!!” అంటూ గట్టి నమ్మకాన్ని పాఠకుల హృదయాల్లో ఆశాంశగా వెలిగించిన ”స్వప్న శబ్దం” అందరూ చదువతగిన కవితాసంపుటి.
డా. రూప్‌కుమార్ డబ్బీకార్ కలం నుండి మరెన్నో కవితా సంపుటాలు వెలువడాలని ఆశిద్దాం.
సైజు : 1/8 డెమ్మి, పుటలు 98, మూల్యం – 40/-
ప్రతులకు : స్వప్న శబ్దం, డా. రూప్‌కుమార్ డబ్బీకార్, హౌస్
నెం. 5-5-21215, సాయికృప అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్ నెం.
102, పటేల్ నగర్, నాంపల్లి, హైదరాబాద్ – 500 001.