పల్లె తల్లి ఒడిలో కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కార సభ
నగరీకరణ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో, పట్టణానికి దూరంగా, పల్లె తల్లి ఒడిలో సాహిత్య సంబరం జరిగితే ఆ అనుభూతి మనసు అంచులకు తగలకుండా ఎలా ఉంటుంది? సరిగా అటువంటి నిజదృశ్యం… కడప జిల్లా నందలూరు సమీపంలో చుట్టూ పంట పొలాల మధ్య ఉన్న గొబ్బిళ శంకరయ్య మెమోరియల్ హైస్కూలు సమావేశ మందిరంలో జరిగింది.
సందర్భం : ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కార సభ.
ఎప్పుడు : 2007 జూలై 15 ఆదివారం ఉదయం 11 గంటలకు.
పురస్కార గ్రహీత : ప్రముఖ స్త్రీవాద కథా రచయిత శ్రీమతి వి.ప్రతిమ (నెల్లూరు)
అధ్యక్షత : సమయోచితంగా పద్యాలు, గేయాలు, కవితలను ఉటంకిస్తూ సభారంజకం గావించే సాహిత్యనేత్రం ఎడిటర్ శశిశ్రీ వహించారు.
నిర్వహణ : నందలూరు కథానిలయం అధ్యక్ష, కార్యదర్శులు ఏ.రాజేంద్ర ప్రసాద్, తవ్వా ఓబులరెడ్డి వారి మిత్రబృందం.
ప్రత్యేకత : ఎవరి పేర అవార్డును వ్యవస్థీ కరించారో ఆ రచయిత కేతు విశ్వనాథరెడ్డి సభకు సతీసమేతంగా హాజరు కావడం.
విశేషం : అవార్డు గ్రహీత వి.ప్రతిమగారి కథాసంపుటి ‘పక్షి’ గురించి… అలాగే స్త్రీవాద విజయం గురించి మాట్లాడేందుకు రాజధాని నించి పల్లెపట్టుకు విచ్చేశారు – ఓల్గా.
ఆప్తవాక్యం : రాయలసీమ యువ రచయితలకు కొండగుర్తు లాంటి పెద్దదిక్కు, నిలకడైన విషయగత ఉపన్యాసం ఇచ్చే సింగమనేని నారాయణ విచ్చేశారు.

ప్రముఖ స్త్రీవాద కథా రచయిత శ్రీమతి వి.ప్రతిమ గారికి కేతు కథాపురస్కార ప్రదానం
”పద్యం – గద్యం ఇరుకారుల సేద్యం” – శశిశ్రీ
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రాయలసీమ ప్రాంతానికి స్పష్టమైన తేడా వుందని – సీమలో ఆధునిక సాహిత్య వాదాలు, ప్రక్రియలు ఆలస్యంగా ప్రవేశించాయని – అయితే పద్యం – గద్యం ఇరుకారుల సేద్యంగా సాహిత్య ఫలసాయం పొందడం ఇక్కడి రచయితల ప్రత్యేకతగా శశిశ్రీ తన అధ్యక్ష వచనంలో పేర్కొన్నారు.
సాంప్రదాయ సాహిత్యానికి పద్మశ్రీ పుట్టపర్తి, ఆధునిక కథకు కేతు విశ్వనాథరెడ్డి, అభ్యుదయ కవిత్వానికి గజ్జెల మల్లారెడ్డి, ఆధునిక సాహిత్య విమర్శకు రాచమల్లు రామచంద్రారెడ్డి ప్రతీకలుగా శశిశ్రీ వివరించారు.
తెలుగునాట ప్రస్తుతం కథా స్వర్ణయుగం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీమ కథా రచయితలు మొత్తం రాష్ట్ర దృష్టి తమ వైపు కేంద్రీకృతమయ్యే విధంగా రచనలు చేస్తున్నారని శశిశ్రీ అభినందించారు.
”అయోమయం నుంచి బయటపడేసేదే స్త్రీవాదం” – ఓల్గా
కొందరు మహిళా రచయితలు – ”మేము జీవితాన్ని రాస్తాము – వాదాల కోసం కాదం”టారు. అలా ఎందుకంటారంటే భయంతో. పురుష రచయితల మెప్పు కోసం – మేం స్త్రీవాదులం కాము కానీ వారికంటే బాగా రాశాం అంటారు.
నిజానికి జీవితం లేకుండా – సిద్ధాంతం కానీ వాదం కానీ లేదు. జీవితం పట్ల శాస్త్రీయ దృక్పథం అవసరం. లింగ వివక్ష అర్థం కానిదే స్త్రీల సమస్యలు అర్థం కావు. జీవితం స్పష్టంగా తెలిసినప్పుడే మంచి రచనలు వస్తాయి.
జీవితాన్ని అయోమయం నించి బయటపడేసేదే స్త్రీవాదం. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కాదు. ప్రపంచాన్ని మార్చాలి – దానికి మన తెలివిడి – జ్ఞానం ఇచ్చే కథలు అవసరం.
సమానత్వం సాధించే వరకు… జీవితాన్ని మార్చుకోమని స్త్రీలు తిరుగుబాటు చేసేలా కథలు ఉపయోగపడాలి. స్త్రీ వాదులు 1995 నించి అనేక విషయాలు చర్చకు పెట్టారు. లైంగిక వేధింపులు, మాయ, రమిజాబీ రేపు కేసులు… వాటి నేపథ్యంలో స్త్రీలు పెద్ద ఉద్యమాలు చేసి – రేప్ లాలో పెద్ద మార్పు సాధించాం. అణిచిపెట్టుకున్న భావాలు స్వేచ్ఛగా ధైర్యంగా బహిరంగంగా చెప్పే స్థాయికి ఉన్నతీకరించాయి స్త్రీ ఉద్యమాలు.
డా|| కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కార గ్రహీత శ్రీమతి వి.ప్రతిమ కథాసంపుటి ”పక్షి” గురించి సోదాహరణగా ప్రసంగిస్తూ – ”రైతులు, మహిళలు, దళితుల మంచి కోరే రచనలు – ప్రతిమ కథలు. ఆర్థిక దోపిడి, పీడనల గురించి రాసిన చక్కటి కథలు అవి. కుటుంబంలో స్త్రీల అణచివేత గురించి 8 కథలు ఉన్నాయన్నారు.
పేదరికం – గ్రామీణ ప్రజల్ని ఎలా కాటువేస్తోందో రాశారు. గత 3 దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం రైతులు, చేతివృత్తుల వారు పక్కకు నెట్టబడుతూ వారి ఉనికే ఎలా ప్రశ్నార్థకంగా మారిందో ప్రతిమ తన కథల్లో చెప్పారు. ప్రతిమ కథలు అర్థవంతమైనవి… ప్రయోజనదాయకమైనవి.
స్త్రీవాదం 1990 దశాబ్దం నించి తిరుగులేని విధంగా బలపడింది. స్త్రీవాదం ప్రభావానికి గురికాని స్త్రీ రచయితలు లేరనే చెప్పాలన్నారు.

ప్రసంగిస్తున్న ప్రముఖ స్త్రీవాద రచయిత ఓల్గా
”సీమ గొంతుక – కేతు” -మధురాంతకం నరేంద్ర
ప్రముఖ కథారచయిత మధురాంతకం నరేంద్ర – కేతు విశ్వనాథరెడ్డిగారి గురించి మాట్లాడుతూ కడప నుండి ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరకు ఎదిగిన రచయిత కేతు విశ్వనాథరెడ్డిని, సీమ గొంతుక కేతు అని శ్లాఘించారు. గొప్ప సాహిత్యమంతా ప్రాంతీయ సాహిత్యమే! కారా, రావిశాస్త్రి కూడా ప్రాంతీయ రచయితలే!! ఐతే సార్వజనీన విషయాలు రాసిన రచయితలు. ఆ కోవకు చెందిన రచయిత విశ్వనాథరెడ్డి. ఆయన కథల్లో సీమ ప్రాంతం జీవితం, తత్త్వం ప్రతిబింబిస్తుందన్నారు.
కొడవటిగంటి కుటుంబరావుగారి మొత్తం సాహిత్యం విశ్వనాథరెడ్డిగారి సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వెలువరించడం విశేషమన్నారు. సీమ ప్రాంతపు నిర్భయం, నిక్కచ్చితనమే గొప్ప సాహిత్య విమర్శకులు ఈ ప్రాంతం నుండి రావడానికి దోహదపడిందని నరేంద్ర పేర్కొన్నారు.
”స్త్రీలపై సరళీకృత హింస” – సింగమనేని
ప్రముఖ కథకులు, విమర్శకులు శ్రీ సింగమనేని నారాయణ ఆప్తవాక్యం పలికి – ప్రతిమ కథల గురించి వ్యాఖ్యానిస్తూ రాజకీయాలు, రైతుల ఆత్మహత్యలు, చేతివృత్తులు, చిన్న పరిశ్రమల విధ్వంసం, కుటుంబ సంబంధాల్లో వచ్చిన మార్పులు, మార్కెట్ సంస్కృతి కుటుంబాల్లో ప్రవేశిస్తున్న వైనం గురించి ప్రతిమ తన కథల్లో బలంగా చిత్రీకరించారు. అవన్నీ స్త్రీ కోణంలోని కథలే. వాటిలో ఏకసూత్రత అదే అంటూ సరళీకృత ఆర్థిక విధానాలు సమాజంలో ప్రవేశం పొందినాక – హింసకు గురవుతున్న వారు స్త్రీలేనని అన్నారు.
”రచయిత ఆత్మముగ్ధత్వానికి లోను కారాదు” – కేతు
ప్రసిద్ధ కథకులు కేతు విశ్వనాథరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ”నా పేర్తో నందలూరు కథానిలయం వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్ అవార్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినప్పుడు వద్దనే కొంతకాలం జాగు చేశాను. కానీ, కడప జిల్లా మంకుపట్టు పట్టి రాజేంద్ర అవార్డు పెట్టాడు. సిగ్గుగా ఉన్నప్పటికీ మనిషిని కదా సంతోషంగానే వుంది. అయితే ఈ సంతోషం అందరి సంతోషం కావాలి. మొదటి అవార్డు సభ నిర్వహించినప్పుడు అమెరికాలో ఉండిపోయాను. ఇప్పుడు రెండవ ఏడు అవార్డు ప్రతిమకు ఇస్తున్నాము రమ్మని కోరడంతో నేను, నా సతీమణి ఇద్దరం హాజరయ్యాం.
అవార్డు సభకు వివిధ ప్రాంతాల నించి రచయితలు వచ్చి ఒక సాహిత్య కుటుంబ వాతావరణం కల్పించడం సంతోషం. సీమకే గర్వకారణమైన సింగమనేని నారాయణకు మొదటి ఏడాది పురస్కారం, ఇప్పుడు రెండవ ఏడాది పురస్కారాన్ని దాదాపు రెండున్నర దశాబ్దాలుగా స్త్రీవాదం కోసం, కథా రచనలో తనదైన శైలిలో నిస్వార్థ కృషి చేస్తున్న వి.ప్రతిమకు ఇవ్వడం తృప్తిగా ఉంది.
నందలూరుకు చరిత్రలో పెద్ద స్థానం ఉంది. ఇక్కడి బౌద్ధారామ శిథిలాల్లో రెండు వేల సంవత్సరాల చరిత్ర దాగుంది. అక్కడ బౌద్ధులు ఒక విశ్వవిద్యాలయాన్నే నడిపారు. నందలూరులో ఈ సభ పరస్పర ప్రశంసల సభ కాకుండా – సాహిత్య సంబంధ విషయాల మీద నిలకడగా జరగడం సంతోషం. నగరాల్లో కూడా ఇలాంటి సభలు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. చివర ఒక మాట చెప్పాలి. ఏ రచయితైనా పాఠకుని కంటే, సమాజం కంటే, తన పక్క వ్యక్తికంటే గొప్పవాడు కాదు! కాకపోతే – తన జీవితంతో పాటు నిత్యం ప్రయాణిస్తూ- రికార్డు చేస్తూ – తన్ను తాను ఉన్నతీకరణకు దోహదపడాలి, తోడ్పడాలి. రచయిత తాను చిత్రించిన జీవితం కంటే గొప్పవాడు కాదు. జీవితం ఉన్నతీకరించడానికి తనతో పాటూ, తన పాత్రలతో పాటూ నిత్యం ప్రయాణిస్తూ పోతాడు – చరిత్ర పురోగతికి తోడ్పడతాడు – రచయిత. ఈ వాస్తవాన్ని రచయిత జ్ఞాపకం పెట్టుకుంటే – ఆత్మ ముగ్ధత్వంలో పడిపోయే ప్రమాదం దాపురించదని శ్రీ విశ్వనాథరెడ్డి సూచించారు.

వేదికపై శశిశ్రీ, కేతు విశ్వనాథరెడ్డి, ప్రతిమ, సింగమనేని నారాయణ, మధురాంతకం నరేంద్ర
”ఈ అనుభూతి గొప్పది” – ప్రతిమ
ఎంతో చారిత్రక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చరిత్ర కల కడప జిల్లాలో… రారా నించి వేంపల్లి గంగాధర్ వరకు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న ఈ నేలపై… కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కారం లభించడం గొప్ప అనుభూతి నిస్తోందని అవార్డు గ్రహీత శ్రీమతి వి.ప్రతిమ పేర్కొన్నారు.
స్త్రీవాద సాహిత్యానికి మార్గదర్శి, నా ప్రియ నేస్తం ఓల్గా సమక్షంలో… సాహితీ గురువు సింగమనేని నారాయణ సాక్షిగా… కథా ప్రియుల, కథకుల మధ్య ఈ అవార్డు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విశేషం ఏమిటంటే ఎవరి పేరు మీద పురస్కారం పెట్టారో ఆ రచయిత సమక్షంలో తీసుకోవడం చాలా ‘టచ్చీ’గా ఉందన్నారు.
కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కారం కింద అవార్డు గ్రహీత ప్రతిమకు అయిదువేలు నగదునిచ్చి జ్ఞాపిక ప్రదానించి కరతాళ ధ్వనుల మధ్య సన్మానించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా డిసిసి ప్రెసిడెంట్ ఏ.అమరనాథరెడ్డి, ప్రముఖ న్యాయవాది వీణా అజయ్‌కుమార్, డా|| కె.శ్రీదేవి, కె.లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నందలూరు కథానిలయం వ్యవస్థాపక అధ్యకక్షులు ఎ.రాజేంద్రప్రసాద్- శ్రీకాకుళంలోని కథానిలయం ద్వారా ఏటా రావిశాస్త్రి అవార్డు ఇస్తున్నట్లే ఇక్కడ కేతు పురస్కారం ప్రదానిస్తూ కథాసేవలో చేతయిన సేవ చేస్తున్నామని – వందన సమర్పణ సందర్భంగా తెలిపారు.- సానెట్.