తెలుగు పతాకం
-జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
[సాహిత్య నేత్రం ఉత్తమ కథా పురస్కార పోటీలు - 2007లో జనరల్ కేటగిరి కింద ద్వితీయ బహుమతి రూ. 3,000/-లు పొందిన కథ]
నేను పుట్టుకచే ఆంగ్లేయుడను. అయిననూ ఆంధ్రము నేర్చితిని. మా మిత్ర సమూహమునందు నేను గానము చేయు భాగవత పద్యములు గాని అన్నమయ్య పదములుగాని నాకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చుచుండును. అది నాకు గర్వకారణము. అందులకే నాయందు ఆంధ్రమనిన అభిమానమున్నది. అంతకు మించిన ఆత్మీయతా గౌరవ భావములున్నవి. బాల్యమునందు మా తల్లి గారైన లూసీమాత నాకు అక్షరాభ్యాసము గావించిరి. ఏదేని ఒక భాష యొక్క వికాసము అవసరమగు అన్య భాషా పదములను సైతము విలీనము చేసికొనుచు ముందుకు సాగుటయందే ఇమిడియుండును. కావున నేటి తెలుగు నేను ప్రయోగించు భాషవలెనుండదని నాకు తెలియును. ఏలనన నా తెలుగు, గ్రంథముల నుండి నేర్చినదేగానీ ప్రయోగము వలన అబ్బినది కాదు.
అందువలన నన్ను చూచిన తెలుగువారికి ఎంత చిత్రమనిపించునో నా మాటలు వినిననూ అంతే విచిత్రముగా నుండగలదు. కానిండు. మరికొద్ది సమయమునకు మా విమానము తెలుగు నేలపై వ్రాలనున్నది. నా బహుకాల స్వప్నము, సత్యము కానున్నది. నా ప్రియమైన గ్రేసు నా ముఖ కవళికలను గమనించుచు చిలిపిగ చిరుదరహాసము గావించుచున్నది. అందులకు గల కారణము నా మనమునందు దాగనియానందము ముఖమునందుప్పొంగుటయేనని నాకు తెలియును.
నా ఈ ఆంధ్ర దేశాగమునమునకు ఒక ప్రత్యేక కారణమున్నది. మేము మా సాఫ్టువేరు కంపెనీ విస్తరణమునకై తగు ప్రదేశమును ఎంపిక చేయవలసి యున్నది. భారతదేశపు సిలికాన్ నగరముగా పేరొందిన బెంగుళారునందు ఆరంభించుట సులభమైననూ నా మనము ఆంధ్రదేశము వైపునకే తిరుగటకు గల కారణము నాయందుగల ఆంధ్రాభిమానమే. అందుకు గల కారణము నేను బ్రౌను దొరవారి బంధువునగుటయే.

ఈ స్వామి కార్యమునకు తోడుగా స్వకార్యార్థమై నా వెంట గ్రేసును బయలుదేరినది. మరియొక రెండు మాసములందు మా వివాహము జరుగనున్నది. వివాహమునకు పూర్వము జరుపు విహారయాత్రలు మధురానుభూతులనిచ్చు తీయని జ్ఞాపకములై కలకాలముండును.
వేకువజామున విమానము, బేగంపేట విమానాశ్రయమునందు దిగినది.
ఆంధ్రదేశము… బాల్యము నుండీ చూడవలెనను కాంక్షచే కల్పనలయందే గాంచిన స్వప్న సామ్రాజ్యము కనుల ముందు ప్రత్యక్షమైన అపూర్వ క్షణములవి. గ్రేసు, తన హేండు క్యామును యొక ప్రయాణీకునకిచ్చి తెలుగునాట అడుగిడు సన్నివేశమును చిత్రీకరింప జేసినది. అనంతరము
మేము ముందే బుక్ చేసికొనిన హోటలు గదికి చేరితిమి.
స్నానాదికములు పూర్తి చేయుసరికి హోటలు గదియందమర్చిన ఎఫ్‌ఎమ్ రేడియో సుప్రభాతము వినిపించుచున్నది. తదుపరి దినఫలములు
ప్రసారమగునని రేడియో జాకీయుడు ముందే తెలిపియున్నాడు. కావున నేను గ్రేసునకు షడ్రుచుల సమ్మేళనమైన యుగాది గురించియూ పంచాంగ శ్రవణము, గ్రహగతులను లెక్కించి దినవారఫలములను లిఖించెడియాచారము గురించియూ వివరించితిని. నాది కన్యారాశి. పుట్టినతేదీ ప్రకారము ఆమెది మిథునరాశి. ఆంధ్రమునందు ప్రసారమగు ఆనాటి దినఫలములను నేను ఆంగ్లమునందు వివరించి గ్రేసు మనమును చూరగొనుటకు సిద్ధముగనుంటిని.
ప్రసారమారంభమైనది. తన శ్రావ్యమైన కంఠముతో దినఫలములను చదువుచున్నదియొక కలకంఠి.
”మిథునరాశి వారు ఈ రోజు మనీ మేటర్స్ సెటిల్ చేసుకుంటారు. ఫ్రెండ్స్‌తో హేపీగా ఎంజాయ్ చేస్తారు. బిజినెస్ పీపుల్‌కి బ్యాడ్‌టైం నడుస్తోంది.
స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుంది. గోల్డ్ సిల్వర్ రేట్లు రైజవుతాయి. ఎనీ హౌ టుడే ఈజె జాయ్‌ఫుల్ డే…”
ఆశ్చర్యము…, గ్రేసునకు నేను అనువదించి చెప్పుటకు పూర్వమే అర్థమైపోయినది.
అంతకు మించిన విశేషమేమన, ఆ రేడియో జాకీయులు ప్రయోగించుచున్న భాష ఆంగ్లము కాదు. ఆంధ్రమునూ కాదు. అయిననిది ఏమైయుండవచ్చును? ఆంధ్రాంగ్లముగానీ, ఆంగ్లాంధ్రముగానీ అయి వుండవచ్చును.
ఈ విధముగ నాలో నేనే తర్కించుకొనుచుండ గ్రేసు నామీద పడి గాఢముగా నొకపరి చుంబించినది. నీవు చెప్పినది అక్షర సత్యము మిత్రమా తెలుగు తీయనైన భాష. వినినంతనే యర్థమగుచున్నది. కానీ అదేలనో నీవు ప్రయోగించెడు భాష నాకు ఇసుమంతయిననూ అర్థము కాదన్నది.
అదియే కదా, నాకును అర్థము కాకున్నది?
ఇంక ఆ జాకీయుని మాటలను విననిచ్చగింపక టెలివిజనును పరికింప నిశ్చయించుకొంటిని. అందు జన్మదిన శుభాకాంక్షలనందజేయు కార్యక్రమం ప్రసారమగుచుండెను. ఆ సూత్రధారిణి పరికిణీ ఓణీలవంటి సాంప్రదాయ దుస్తులలో చూడముచ్చటగనున్నది. తనకూ అటువంటి దుస్తులను ధరించు కోరిక కలుగుచున్నదని తెలిపినది గ్రేసు. అది ఏమి భాగ్యము. ఏదేని మంచి బట్టల దుకాణమునకు బోయి, అచట నీకిష్టమగు దుస్తులను కొనియెదవుగాక అని వాగ్దానము చేసితిని.
ఆ టెలివిజనునందలి యాంకరిణి ఉపయోగించు భాష సైతము జాకీయుని మాటలవలె నాకన్నను గ్రేసునకే సులభముగా అర్థమగుచున్నది. మేమా టెలివిజనును వీక్షించుచుండగనే ఫలహారము వచ్చినది. ఇరువురము ఫలహారము భుజించి నగర దర్శనార్థము బయలుదేరితిమి.
మేము ఈ నగరమున వసించునంత కాలము మాతోనే యుండునటుల ఒక టాక్సీని కుదుర్చుకుని బయలుదేరితిమి. ఓం ప్రథమముగ అసెంబ్లీ
కడకేగితిమి. అచటనున్న గాంధీ మహాత్ముని విగ్రహమునకు మ్రొక్కితిమి. ఆ వెనుక జాతీయ పతాకము రెపరెపలాడుచున్నది. ఆ భారత జాతీయ పతాకమును రచియించినది ఒక ఆంధ్రుడేననియు ఆయన నామధేయము పింగళి వెంకయ్యగారనియు తెలిపితిని. గ్రేసు ఎంతయు సంతసించినది. అంత చక్కటి త్రివర్ణ పతాకమందించిన తెలుగువారి పతాకము ఇంకెంత అద్భుతముగా నుండునో చూచి తీరవలయునన్నదియామె. నాకును అదియే కుతూహలము.
అచటి నుండి తెలుగుతల్లి విగ్రహము కడకేగితిమి. అది తెలుగుతల్లి విగ్రహమని చెప్పగానే గ్రేసు ఆ విగ్రహమునకు కడు నాటకీయముగా
ఆంగ్లమునందు నన్ను పరిచయముగావించినది. ఈతడు బ్రౌను దొరకు చుట్టమైయున్నాడు. వారి వారసత్వముగా ఆంగ్లముతో బాటుగా ఆంధ్రము సైతము నేర్చినాడు. ఇచటనే యొక మల్టీనేషనలు కంపెనీ స్థాపించనున్నాడు, ఆతనికి నీయాశీర్వాదముల నొసంగుము అనుచు ఆమె చేసిన అభినయమునంతయూ చిత్రీకరించితిని.
అనంతరము ప్రసంగ వశమున గ్రేసు, ”నీ వెంటే నేనుంటా… ఎప్పుడైనా.. ఎక్కడైనా…” అన్నది. ఆశ్చర్యము. గ్రేసు నోటివెంట అచ్చతెలుగు.
అంతియే కాదు; నువ్వు… నేను… ప్రేమ! పెళ్ళి! ఇది, కొత్త బంగారులోకం అని కూడ అన్నది. నేనా పదముల అర్థములను వివరించి చెప్పితిని.
కాని గ్రేసు మాత్రము ప్రేమ పూర్వకములైన ఆ తెలుగు పలుకులను ఎచట నేర్చినదో ఎటుల నేర్చినదో ఎంత అడిగిననూ చెప్పదాయెను.
తెలుగునాట అడుగుపెట్టగానే ఆమెకూ జాను తెలుగు జాణతనమబ్బినది గాబోలు.
మేమచటి నుండి తెలుగు నాయకుల విగ్రహములన్నింటినీ దర్శించుచు ఆ చివరి వరకు నడిచితిమి. నడచునంత కాలము ఆయా పుణ్యమూర్తులను గూర్చి నేనెరిగినది గ్రేసునకు వివరించితిని. ఆమె సంభ్రమమున వినియానందించినది. మేమా చివరికి చేరుసరికి ఆ ట్యాక్సీ నాతడు సిద్ధముగ నుండెను. మరల మా సందర్శనమారంభమైనది.
టాక్సీ ఒక కూడలి యందాగినది. అచట ట్రాఫిక్ జామైయున్నది. ఆవైపున ఒక హోర్డింగున్నది. దానిని చూచిన వెంటనే గ్రేసు నేర్చిన తెలుగు
పలుకులు ఎటుల నేర్చినదో అర్థమైనది. మరికొద్ది క్షణములకు నేనూహించినటులనే గ్రేసు నన్ను గాంచి, ”ఆటా పాటా… చదువూ సంధ్యా… దటీజ్ ప్రగతి” అన్నది. అందులకు నేను నవ్వుచూ ”నీ తెలుగు పలుకుల తళుకులెక్కడివో తెలిసినదిలే” అనిన వెంటనే గ్రేసు గుంభనముగ దరహసించినది. అనంతరము ఆటపాటల చదువు సంధ్యలగరపు విద్యాలయమైనట్టి ప్రగతియను పాఠశాల వారు వ్రాయింపించిన ఆ ప్రచార ఫలకమును గూర్చి వివరించితిని.
నా వివరణము వినిన గ్రేసు ఎంతయు సంతసించినది. అంతియేగాక నావంటి తెనుగు నేర్వని పరదేశీయులకు కూడ తెనుగు తీపిని పరిచయించుటకై ఆంగ్లాక్షరములందు ఆంధ్రపదములను వ్రాయింపించిన వారి భాషాభిమానము నిరుపమానము గాన నీవు సమ్మతించిన యెడల ఒక పరియా ‘ప్రగతి’ పాఠశాలను సందర్శింతమా ప్రియతమా అని ప్రార్థించినది. నాకును ఆ పాఠశాల వారిని అభినందనార్హులేయనిపించినది. అందులకే, టాక్సీని ప్రగతికి మళ్ళింపుమంటిని.
మాటలయందే ప్రగతియనునా పాఠశాలను చేరితిమి. దాని ప్రాంశుపాలుని సందర్శించితిమి. ఆతనిని గ్రేసు ఎంతయు అభినందించినది. కానీ
ఏలనో ఆ ప్రాంశుపాలుడు మేము ఎందులకు అభినందించుచుంటిమో అర్థము కానివాని వలె చూచినాడు. అంతియే కాదు మాయభినందన
ములను స్వీకరింప సంకోచించుచు అయోమయము పడుచుండెను.
అంతలో… అంతకు మునుపెన్నడు మావంటి తెల్లవారిని చూచియుండని ఒక విద్యార్థి ఉత్సాహముగ మా వద్దకు వచ్చి నన్ను ఆటోగ్రాఫు అడిగినాడు. నేనందు సకల విద్యాబల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని వ్రాసి చేవ్రాలు చేసితిని.
ఆ విద్యార్థి నేను వ్రాసినది చూసినాడు.
ఆ తరువాత దానిని జదువ యత్నించుచు, న.. ఊహుఁ… ద… ఊహుఁ… స… ఊఁ స.. క.. సక… సక… యరల… ఊఁ… ల…
సకల… అనుచు కిందమీదలు పడుచుండగా ఆతనియవస్థను చూడజాలని ప్రాంశుపాలుడాయాటోగ్రాఫు పొత్తమును తీసికొనినాడు. అందు నేను వ్రాసిన దానిని జదివి దానిపై భాగమున ఆయా పదములను ఆంగ్లాక్షరములందు వ్రాసి ఇచ్చెను. ఆశ్చర్యము, ఇప్పుడా విద్యార్థి నేను వ్రాసినదానిని గడగడ జదివినాడు. అంతియేగాక నేను వ్రాసిన దేమియో అర్థము చేసికొనినాడు. అనంతరము తన తాతగారు కూడా నమస్కరించినపుడు ఈ విధముగనే ఆశీర్వదింతురని తెలిపి, తన తాతగారిని జ్ఞాపకము చేసినందులకై నన్ను అభినందించి వెడలిపోయెను.
తెలుగు భాషను తెనుగు అక్షరములందు చదువజాలని తెలుగు విద్యార్థి… అదియూ తెలుగు రాజధాని నడిబొడ్డున… ఇదియేమి వైపరీత్యము?
తమరు తమ విద్యార్థులకు తెలుగు బోధింపరా ఏమి అనిన వెంటనే ఆ ప్రాంశుపాలుడు బహు తేలికగా; ఆఁ తెలుగుదేముంది మాస్టారూ, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అయినా తెలుగులో మంచి మార్కులు తెప్పించడం చాలా కష్టం. బోల్డు టైం వేస్టు. అదే శాన్‌స్క్రీటయితే ఓ నాలుగు శబ్దాలూ అరడజను శ్లోకాలూ బట్టీ వేయిస్తే చాలు ఫస్ట్ క్లాస్ మార్కులొచ్చేస్తాయి. అందుకే మా స్కూల్లో తెలుగుండదు. మేం తెలుగు పెడదామన్నా పేరెంట్స్ ఒప్పుకోరు అని వివరించినాడు.
ఆ ప్రాంశుపాలుని వివరణానంతరము నాకు తల దిరుగుచున్నదో లేక వారికి మతి భ్రమించినదో అర్థము కాదాయెను. అయిననేమి, వ్యాపార
ఫలకములందలి ఆంగ్లాక్షరాంధ్ర రహస్యము బోధపడినది. అంతియే కాదు, మరికొంత సమయము ఆ ప్రగతియందే కూర్చుండిన మా ప్రగతి మాట దైవమెరుగు, మా ఉన్న మతులు కూడ గతులు తప్పుట తథ్యమని తెలిసినది.
అందులకే నేను లేచితిని. నన్ను జూచి గ్రేసుయును లేచినది.
వెంటనే ప్రాంశుపాలుడు తన దినచర్య పొత్తమును దెరచి నా దూరవాణి సంఖ్య తెలుపమని కోరెను. దానిని నేను నా వైపునకు తిప్పుకొని నా
పేరును, దూరవాణి సంఖ్యను తెలుగునందే వ్రాసి యిచ్చి వెనుదిరిగితిని. అంతనా ప్రాంశుపాలుడు తన యాసనము నుండి లేచివచ్చి ”సార్, పొరపాట్న నెంబరు మీ భాషలో వేసేసినట్టున్నారు. దయచేసి తెలుగులో చెప్పండి నేను వేసుకుంటాను” అని విన్నవించినాడు.
అప్పటికే నా సహనము నశించినది. అయినను నిగ్రహించుకొని, ”నేను వ్రాసినది నా భాష కాదు అమాయక స్నేహితుడా, అది మీ భాషయే” అనుచు నిష్క్రమించితిని.
ఈ ప్రాంశుపాలునికన్ననూ ఆ రేడియో జాకీయులు యాంకరిణులే మేలు. వారు ఈ తరమును మాత్రమే చెరుపగలరు. మరియొక సౌలభ్యమేమన, స్విచ్చు మీట నొక్కిన చాలును, వారి కంఠములును నొక్కబడును. కాని యిటువంటి ప్రాంశుపాలుర వలన కలుగు నష్టము అపారము. విద్యగరపు నొజ్జయే స్వలాభాపేక్షచే విద్యార్థులను దారి తప్పించిన యెడల ముందు తరముల వారు వారికంటె ఘనులై సాంస్కృతిక కంటకులగుదురు. ఇది ఏ సమాజమునకైనను మంచిది కాదు.
అయిననూ ఇది ఎక్కడి చోద్యము? తెలుగునాటనే తెలుగు పిల్లలకు తెలుగు అక్షరములు రావు. గురువులకు తెలుగు అంకెలు తెలియవు.
ఆ ప్రాంశుపాలుని పొత్తము అన్నియూ ఇంగ్లీషు అంకెలే. అతడు వాటినే తెలుగు అంకెలని భ్రమ పడుచున్నట్లున్నాడు. సిగ్గు సిగ్గు.
గ్రేసునకు నా గోడు వెళ్ళబోసుకుంటిని. ఆమె నా వేదనను అర్థము చేసికొని నన్ననునయించినది.
ఏదేని యొక భాషయొక్క అభివృద్ధి అన్యభాషా పదములను తనయందిముడ్చుకొనుచు ముందుకు సాగుటయందే యుండును. కాని ఇచట
కనబడుచున్నది ఏమి…, తెలుగునందు ఆంగ్లపదములను ఇముడ్చుకొనుట కాదు, తెలుగునే ఆంగ్లము నందిమిడ్చెడి యత్నము జరుగుచున్నది. ఇది దారుణము.
గ్రేసు నా దృష్టిని మళ్ళించుటకై ఒక బట్టల దుకాణము ఎదుట టాక్సీ ఆపించినది. అచట ఆమెకు నాలుగు చీరలు తీసుకొని అచటనే కుట్టుటకిచ్చితిమి. అంతదనుక ఆ దుకాణమునందే పైభాగముననున్న బంగారు ఆభరణముల విభాగమునకరగితిమి. లోలాకులు, గాజులు,
గజ్జెలు, రత్నహారము తీసి కొంటిమి. ఆ యంగడియందలి ఒక యువతి గ్రేసునకు చీరకట్టుట నేర్పించినది. ఆ అంగడియందే ఆభరణములను
అలంకరించుకొనుట ఏమి… వాటి ఫలితముగా గ్రేసులో పెరిగిన అందములేమి… చుట్టిన చెంగావి చీరతో చేరిన ఆ కొత్తకొత్త కులుకులేమి… చెప్పుటకు మాటలు చాలవు, చూచుటకు కనులు చాలవు.
అచటి నుండి నేరుగా హోటలు గదికి వెడలినాము.
భోజనము చేసి, కొంత సమయము విశ్రమించి సాయం సమయమున మరల నగర సందర్శనము చేయవలయునని నిశ్చయించుకొంటిమి.
ఆ సాయంత్రపు కార్యక్రమములు నిర్ధారించుకొనుటకై దినపత్రికను చూచితిని. రవీంద్రభారతియందు భువన విజయము నాటకమున్నది. అష్టదిగ్గజముల నడుమ ఆంధ్రభోజుడు జరుపు సాహిత్యగోష్టియనిన సామాన్య విషయముగాదు. దానిని గ్రేసునకు జూపిన ఆమెకును తెలుగు తీపిదనము రుచి చూపినట్లగును. కానీ అదే సమయమున సికిందరాబాదు నందు ఆంధ్రభాషాభివృద్ధి సంఘమువారి సమావేశమున్నది.
నాకు ఈ రెంటినీ చూడవలయునని యున్నది. కానీ ఒకదానికి మాత్రమే పోగలము. ఈ విషయమునందు గ్రేసు సలహాను తీసుకొనుట
ఉచితమనిపించినది. నేను అడిగిన వెంటనే ఎంతమాత్రము జాగుసేయక, నాటకమనిన మరుపు దర్శనములుండును. భాషాభివృద్ధి సంఘమువారి సమావేశము మనకోసమై మరల మరల జరుగదు. నీకు భాషాభిమానము మెండుగనున్న కారణమున నీవంటి భాషాభిమానులు పెక్కుమంది చేరు సమావేశమునకరగినచో అభిప్రాయ వినిమయమునకు అవకాశముండునుగాన భాషాభివృద్ధి సంఘ సమావేశమునకే పోయెదమని సూచించినది. ఇదియే గ్రేసు విశిష్టత. సమయమునకు తగు సలహాలనిచ్చును. సూచనలను చేయును. మీదు మిక్కిలి ఎదుటివారి హృదయమెరిగి మెసలును.
ఆ పత్రికను పరికింపగా అందు అక్షరములు మాత్రము తెలుగునందున్నవి గాని అంకెలు ఆంగ్లమునందుండుట కనుపించినది. ఎంతజూచిననూ ఒక్కటనిన ఒక్క తెలుగు అంకెనూ కనుపించదాయెను. దానిని మించిన విచిత్రమొకటున్నది. కొన్నిచోట్ల రోమను సంకేతములు కనిపించినవి. తరచిజూచిన ఈ పత్రిక వరసయును ఆ ప్రాంశుపాలుని వలె కడు విపరీతముగ తోచుచున్నది. వీరికి రోమను సంజ్ఞలను వాడగల సౌజన్యమున్నదిగాని తెలుగు అంకెలను అచ్చొత్తించు అభిమానము లేదు.
నేనీ విధముగ చెప్పిన వెంటనే గ్రేసు, ‘లేనిది అభిమానముగాదు ఆత్మగౌరవము’ అన్నది. అదియును నిజమే. కాకున్న పాఠశాలలందు తెలుగు
విద్యార్థులకు ఆంధ్రమును విస్మరించి ఆంగ్లమునందు మాత్రమే విద్యగరపుట సంభవింపదు.
ఆ ప్రగతియందు తెలుగు పతాకమును చూడవలెనను నా ఆశ ఈడేరలేదు.
సాయంకాలము సమావేశమునందైననూ నా కోరిక తీరునేమో వేచి చూడవలె.
ఆ సాయంత్రము నిర్ణీత సమయమునకు ముందే సమావేశ స్థలమునకు చేరుకొంటిమి. మేమూహించినటుల అచట పతాక వందన కార్యక్రమము జరగలేదు.
కాని తెలుగుతల్లి చిత్రమునకు పూలమాలలు అలంకరించినారు. జ్యోతి ప్రజ్వలనము గావించినారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండయనుచు శ్రావ్యముగ గానము చేసినారు. ఆ గానమాలకించుచున్న గ్రేసు ముఖమునందు తన్మయత్వము గోచరించుచున్నది. అందులకే నేనామె ఏకాగ్రతను భంగపరచనిచ్చగింపక నిశ్శబ్దమును పాటించితిని.
అనంతరము వక్తల ప్రసంగములు. ఆయుపన్యాసములను నాకన్నను శ్రద్ధగ ఆలకించినదామె. అనంతరము తనయభిప్రాయమును వెల్లడించినది. ఇది వీనులవిందైన భాష. వినిన కొలదీ మరింత వినవలయుననిపించుచున్నది. చూడజూడ ఇది సంగీతమునకనువైన భాషవలె తోచుచున్నది. సరళ గంభీరముగ సాగిన ఆ ఉపన్యాసములను అర్థము చేసికొనజాలని తన అసమర్థతకెంతయు ఖేదపడుచుంటానని తెలిపినది.
ఆ సభ సంపన్నమైనది.
నేను ఆ తెలుగు భాషావేత్తలను అభినందించి పతాక వివరములను తెలుసుకొనుటకై వేదిక దాపునకేగితిని. గ్రేసును నన్ననుసరించినది. నేను
వారితో సంభాషించుచుండ నా పరముగ గ్రేసు పెద్దల ఆటోగ్రాఫులను స్వీకరించుచున్నది.
తెనుగు సంస్కృతీ సాంప్రదాయముల గూర్చి యనర్గళముగ ప్రసంగించిన ఒక వక్తను జేరి నన్ను నేను పరిచయము చేసికొంటిని. నేను పతాకమను పదమునుచ్ఛరింపగనే ఆయన పతాక ప్రసంగమారంభించినాడు. పతాకమనిన ఒక జాతియొక్క గౌరవ ప్రతిష్టలకు చిహ్నము. భారత జాతీయ పతాకమును రూపొందించిన పింగళి వెంకయ్య మన ఆంధ్రుడైనందుకు తెలుగువారు గర్వించవలయునని, తెల్లవాడనైయుండియు
తెలుగునింత స్పష్టమునుచ్ఛరింపుట తనకెంతయు ఆనందము కలిగించినదనియును తెలిపి అచటినుండి నిష్క్రమించెను. నేనడిగినది వారికర్థము
కాలేదో లేక వారికర్థమగు రీతిన నాకు అడుగుట రాలేదో అర్థముగాక మరియొక భాషాభిమాని నాశ్రయించితిని.
ఆయన నా నోట తెలుగు భాషను వినినయానందమున నాచే తెలుగునందు ప్రసంగింపజేయు యత్నమారంభించెను. ఇండ్లకు మరలినవారిని తిరిగి కూర్చుండబెట్టి వారికి నా భాషాజ్ఞానము ప్రదర్శించు కోరిక నాకు లేదు. అందులకే వారిని వారించి నేను వచ్చిన కార్యము నివేదించితిని. ఆయన తెలుగు పతాకమా? యని ఇంచుక తికమకపడి, లేకేమి… ఉన్నది. కాని ఇక్కడ దొరకదు అని చెప్పి తప్పించుకొనెను. నేనడిగినది తెలుగు పతాకమెచట లభించునో తెలుపుడని కాదు. అయినను వారు మాత్రము ఎచట లభింపదో తెలిపి నిష్క్రమించిరి. మరియొక పండితుడు తెలుగువారికి సభాస్థలములందు జ్యోతి వెలిగించెడు ఆచారమేగాని పతాకావిష్కరణముగావించు పద్ధతిలేదని వివరించెను. వేరొక పెద్దమనిషి
నిజాయితీగా తానింతవరకూ పతాకము గురించి యాలోచించి యుండలేదనియూ ఆ కారణముచే తానా వివరములను తెలిసికొనలేదనియు
ఒప్పికొనెను. అంతియేగాక కొంత సమయమిచ్చినచో పూర్తి వివరములను సేకరించి తెలియజేయుదునని జెప్పి నా దూరవాణి సంఖ్యను తీసికొనెను. చివరికి యొక పండితుడు ”తెలుగు పతాకం ఎగురని దిశయే లేదు” అను పతాక వందన గీతమును నేను వినియుంటిని. పతాక వందన గీతమున్నదనిన పతాకము కూడ తప్పక ఉండియుండును. నా బాల్యమునందు వడ్డాది పాపయ్యగారు పతాక రచన గావించియుండిరని వినియుంటిని. తెలుగువాడవు గాకున్నను తెలుగు భాషయెడల నీకున్న యభిమానమును, తెలుగు పతాకపు వివరమును తెలుసుకొనగోరు నీ కోరికను మెచ్చదగినవని నన్నభినందించి వెడలిపోయెను.
ఇది కడు విచిత్రము. కడుంగడు విపరీతము. అందరునూ తెలుగువారే… అందరునూ భాషాభిమానులే… మీదుమిక్కిలి తెలుగు సంరక్షకులు
గూడ. అటువంటి వారికే తెలుగు పతాకమున్నదో లేదో… అనుమానము! అది ఉన్నచో ఎటులుండును? దాని వైశిష్ట్యమేమి? లేనిచో ఎందులకు లేదు? లేకుండుటకు గల కారణములేవి? అన్నియు అనుమానములే… నాకు మాత్రమే కాదు, వీరికి కూడ.
నాకచటి పరిస్థితిని గాంచిన తదుపరి… నిలుచున్న చోటనే కూలబడి యేడ్వవలయునన్నంతటి దుఃఖము కలిగినది. నా నిరాశయును నీరసమును గాంచిన గ్రేసు నా మనసేదో తీరని వ్యథ జెందినదని అర్థము జేసికొన్నది. నా భుజముపై చేయి వేసినది. ఆమె చల్లని చేతిస్పర్శ నా హృదయ వేదనమును ఉపశమింపజేయు సంజీవనియైనది.
ఆమె నన్ను అచటి నుండి బయటకు తోడ్కొని వచ్చినది.
అచటి నుండే హోటలు గదికి తిరిగి వచ్చుచుండగ దారియందు రవీంద్రభారతి కనుపించినది. అప్పటికింకను భువన విజయము ప్రదర్శింపబడుచునే ఉన్నది. మేమును పోయి చివరి యంకమును జూచితిమి. చివరి యంకమైననూ మమ్మిరువురనూ విజయనగర సామ్రాజ్యమునకు గొనిపోయినది. అష్టదిగ్గజముల అజరామరమగు సాహితీ గంధము గుప్పున గుబాళించినది. గ్రేసును రాగయుక్తమైన పద్యపఠనమునకు మైమరచినది.
అనంతరము అచటి నుండి మా హోటలు గదిని చేరితిమి.
రాత్రి భోజనమునకు ముందు ఒక పెగ్గు స్కాచ్ ఆన్ రాక్స్ నాకునూ, గ్రేసునకు వైనునూ సేవించుట అభ్యాసము. ఆ రాత్రియును మా దైనందిన పానము గావించుచు సంభాషణమును కొనసాగించితిమి. మా సంభాషణము లోకములన్నిటిని చుట్టి మరల మరల ప్రగతి ప్రాంశుపాలుని యొద్దకో తెలుగు పతాకము వద్దకో వచ్చి చేరుచున్నది.
ప్రసంగ వశమున గ్రేసు తన ఆటోగ్రాఫు పొత్తమును చూపి నా దృష్టిని మళ్ళింప యత్నించినది. ఆమె అంత తక్కువ సమయమునందే
సాధ్యమగునన్ని ఎక్కువ ఆటోగ్రాఫులను సేకరించినది. ఆమె ఆటోగ్రాఫులనిచ్చిన వారి సంతకములను జదువ యత్నించినది. దాదాపుగ
అందరి పేర్లను చదువగలిగినది. ముచ్చటగ మూడు తప్ప. వాటిని గ్రేసు చదువజాలదు. ఏలనన ఆ మూడును తెలుగు చేవ్రాళ్ళు.
సంతకమనిన సామాన్య విషయముగాదు. అది ఆ వ్యక్తి యొక్క పరోక్ష పరిచయము. ఆతని వ్యక్తిత్వమునకు గురుతు. అందులకే దానిని ఆ
వ్యక్తియొక్క అంతరంగావిష్కరణముగ నెంతురు. అయిన, ఆత్మావిష్కారమునకే ఆంగ్లమును పయోగించువారు ఆంధ్రమునకు చేయదగినదైననూ
ఏముండును ఇటువంటి సమావేశములను నిర్వహించుట తప్ప!
నా మాటలకు గ్రేసు ”ప్రియతమా, ఈ యాటోగ్రాఫులను జూపి నీ హృదయ భారమును మరింతగా పెంచి యుండిన యెడల మన్నింపుమని” వేడినది.
అప్పటికే నేను రెండు పెగ్గులు ఎక్కువ సేవించితిని.
మా సంభాషణము కొనసాగుచునేయున్నది. గ్రేసు, మనము ఇప్పుడు ఈ నగరమును ఏ స్థితి యందుండుటను చూచి వ్యథ చెందుచుంటిమో అది ఇప్పటికిప్పుడే సృష్టింపబడినది కాదు. ఇది కొన్ని దశాబ్దములుగ అనుదినము అభివృద్ధి చెందుచు ఇప్పటికి ఈ పరిస్థితికి చేరియుండును. ఆ పరిణామ క్రమమునెరుగని నీవంటి అతిథులకు ఆశ్చర్యమును కలిగించును లేదా ఆవేదనమునైనను రగుల్చును”.
ఆమె మాటలకు తలయూచుచునే మరియొక పెగ్గును వేసుకొనుచుండగా వారించినది గ్రేసు. సీసా మూతను బిగించుచు చిరుదరహాసముతో
స్థిరచిత్తురాలై అన్నది ”ప్రియా, తెలుగు నీ ఆరవ ప్రాణమని నాకు తెలియును. అందువలననే తెలుగునకైన గ్లాని, నీ ఆత్మగ్లానిగ పరిణమించినది.
ఇన్నేండ్లుగ నీవు కన్న కలలు కనులముందే కల్లలైనందులకు కలుగు దుఃఖము సామాన్యమైనది కాదు. నీవే యోచింపుము ఇది కేవలము ఖేదపడి సంతాపము ప్రకటించినంతనే తీరెడి సమస్య కాదు. ఈ సమస్యను ఎదురించుటకు నీవేమి చేసిననూ, నేనును నీ వెన్నంటి యుండగలదానను. కేవలము బాధపడుచు మరియొక పెగ్గు సేవించుటకు దప్ప”.
ఆమె పలుకులు… నాపాలి పరశువేదులు!
‘తెలుగు పతాకం’ వెనుక…
హైదరాబాద్ వేదికగా 1998లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. అందులో ప్రత్యేక ప్రశంసకి పాత్రమైన ”ఇకినాయ్” చిత్రదర్శకుడికి ఇంగ్లీషు రాదు. చివరికి ఆంగ్లంలో సంతకం కూడా పెట్టలేడు. అయినా సరే ఆ యువకుడు అంతర్జాతీయ స్థాయి దర్శకుడు అయ్యాడు. ఈ కథకి ఆయన పరిచయం ఒక ప్రేరణ అయితే మరో ముఖ్యకారణం కూడా వుంది.
2006 నవంబరులో జెట్ టిక్కెట్ కొనుక్కుని బస్సులో ప్రయాణిస్తూండగా జరిగిందీ సంఘటన. దానిమీద నేను తెలుగులో సంతకం చేశాను. దాన్ని చూసిన కండక్టర్, ‘ఈ టిక్కెట్ మీదేనా?’ అని శంకించాడు. ఎందుకా అనుమానం వచ్చిందని అడిగితే, ‘చూస్తూంటే చదువుకున్నవారిలా కనిపిస్తున్నారు. మరి తెలుగులో సంతకం పెడితే అనుమానం రాదా?’ అని ఎదురు ప్రశ్నించాడు. అంటే ఆయన దృష్టిలో చదువురానివాళ్ళు మాత్రమే తెలుగులో సంతకం పెడతారన్నమాట. చివరికి ఆ కండక్టరూ, డ్రైవర్ల ఎదురుగా సంతకం చేసి చూపించేంతవరకూ వదల్లేదు. అక్కడ అక్షరం ముక్కైనా ఆంగ్లం నేర్వకుండనే ఆయన అంతర్జాతీయ స్థాయికి ఎదిగితే, ఇక్కడ కేవలం తెలుగులో సంతకం పెట్టిన నేరానికి బస్సులో అందరిముందూ అది నా సంతకమేనని నిరూపించుకోవడానికి నానాతంటాలూ పడాల్సి వచ్చింది.
ఏమిటీ వైపరీత్యం?
ఎదుటివారిని నెత్తినెక్కించుకోవడానికి మనరాష్ట్ర చిహ్నం పూర్ణకుంభంతో స్వాగతిస్తాం. కానీ మన జాతిగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కనీసం జెండా అయినా లేని జాతి మనది.
తెలుగునాట తెలుగు వెనకబడుతూండటం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మిత్రుడు పలమనేరు బాలాజీ దీన్నొక వ్యాసంగా రాయమని సూచించారు. కానీ అదిలా ‘తెలుగు పతాకం’గా వెలువడ్డానికి కారణం సాహిత్యనేత్రమూ, దాని సంపాదకులు శశిశ్రీ గారూను.
ఇంక నా గురించి…
ఆటా నిర్వహించిన మొదటి నవలల పోటీలో నా నవల ‘వలస దేవర‘కి మొదటి బహుమతి లభించింది. వారి నుంచీ మరో మూడు కథలకి కూడా బహుమతులు వచ్చాయి. అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ వారినించీ మరో రెండు కథలకీ, వివిధ పత్రికలూ, సాహిత్యసంస్థలూ నిర్వహించిన కథల పోటీల్లో మరో ఆరుకథలకీ బహుమతులు వచ్చాయి.
ఈటీవీ కన్నడ వాహినిలో రచన, కార్యక్రమ నిర్వాహక విభాగంలో ఉద్యోగం. కన్నడ కార్యక్రమాలు రూపొందించడం రచించడం చేస్తూంటాను.
అంకితం
నన్ను తెలుగు పండిట్ చేయాలని కలలుగన్న, మా నాన్నగారు కీర్తిశేషులు జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారికి…!
హైదరాబాద్ వేదికగా 1998లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. అందులో ప్రత్యేక ప్రశంసకి పాత్రమైన ”ఇకినాయ్” చిత్రదర్శకుడికి ఇంగ్లీషు రాదు. చివరికి ఆంగ్లంలో సంతకం కూడా పెట్టలేడు. అయినా సరే ఆ యువకుడు అంతర్జాతీయ స్థాయి దర్శకుడు అయ్యాడు. ఈ కథకి ఆయన పరిచయం ఒక ప్రేరణ అయితే మరో ముఖ్యకారణం కూడా వుంది.
పుల్లాయన said,
October 7, 2008 @ 7:25 am
చాలా బాగా ఉంది ఈ కథ. చదివినంత సేపు కళ్లకు కట్టినటుంది. నిజంగా గ్రేసు, కధా నాయకుడి పాత్రలు కళ్లకు కట్టినట్లు ఉన్నాయి. చదివినంత సేపు నిజంగానే జరుగుతుంది అన్నట్లు అనిపించింది. నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగా మనకి ఆత్మగౌరవం లేదేమో. ఇలా బడుల్లో, పాఠశాల్ల్లో తెలుగు నేర్పక పోవటం నిజంగా దారుణం. .
Noorbasha Rahamthulla said,
November 2, 2008 @ 1:23 am
భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించరు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మాగ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథంస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కత గని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండ గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం. కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగు తుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షులపేర్లు చెప్పారో చూడండి: మట్టగిడస, కర్రమోను, బొమ్మిడయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….. పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపుచిలుక, నత్తకొట్టుడు…. భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం అన్నారు నెహ్రూ. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005) అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించు కుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడ వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్ హైదరాబాద్ రావటం, సివికాన్ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్ అతిథి భవనంలో అమెరికా వెళ్ళ టానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు:
ఆంగ్లమేరా జీవితం- ఆంగ్లమేరా శాశ్వతం ఆంగ్లమే మనకున్నది- ఆంగ్లమేరా పెన్నిధీ ఆంగ్లమును ప్రేమించు భాయీ- లేదు అంతకు మించి హాయీ ||ఆంగ్ల|| తెలుగును విడిచీ- ఆంగ్లము నేర్చీ అమెరికా పోదామూ- బానిసలవుదామూ డాలర్లు తెద్దామూ ||తెలుగు|| అంటూ పాటలు కూడ పాడుతున్నారు. తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణా లతో సహా వివరిస్తున్నారు: 1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనను పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు. 2. పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండ చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు. 3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవా లని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండి తులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.
4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డులపేర్లు చద వాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడ అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సుల భంగా వస్తుంది. 5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్ను లెత్త బ్రహ్మవశమే? 6. కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్ నేర్వాలి. 7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్య మాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి. ఇక మనం తెలుగువాళ్ళం అనీ, మన తెలుగును రక్షించుకుందాం అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?: 1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా? 2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన 3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సుళువుగా వస్తుంది. మన లిపిని కంప్యూ టర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం. 4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడ తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి? 5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం. 6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండలి. కంప్యూటర్ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషు లోకి అనువదించుకున్నారు. అవసరం అటు వంటిది. 7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం చెయ్యడమే. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందు లకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృ భాషకు ప్రాథంమిక విద్యలోకూడ స్థానం లేకుండ చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా? మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిర స్కారం అన్నారు మహాత్మాగాంధీ. మాతృ భాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడ సరిగా రావు అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారు: మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయ స్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం. (అమ్మనే మరుస్తారా! ఈనాడు 27-2-2006) అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథల మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ డానియల్ నెగర్స్ ఇలా అంటున్నారు: తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకో డానికి సీఫెల్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయు లకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించ లేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషాసంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాష లున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులు తాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడు కోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు. (ఆంధ్రజ్యోతి 22-2-2006) ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవ సరమైన పదాలను రాయడంలో, చదవ డంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు. మెదక్ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్ పూర్ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోం దట. విత్తనాల పేర్లు చూడండి: తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డ జొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ. (వార్త 6-3-2006) ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవ సాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్ పదాల కిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడ ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయాని కొచ్చారు. బాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది. తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించు కోవాల్సిన పదజాలం ఎంతోఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగు తుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచి నపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథంమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు. ప్రైవేట్ స్కూళ్ళు తెలుగు నేర్పవు. మార్కుల కోసం కళాశాల విద్యార్ధులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో? కర్నాటకలో కన్నడం లేకుండ హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమి ళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభు త్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి. భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారుకూడ వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవం గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని తెలుగు మాండ లిక భాషా దినోత్సవం గానూ జరుపుకుంటు న్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.
Noorbasha Rahamthulla said,
November 3, 2008 @ 6:03 am
ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ.బి.కె.ప్రసాద్ కీలక పాత్ర వహించారు.ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్పూర్తి అంటారు ఏబికే.
Noorbasha Rahamthulla said,
November 5, 2008 @ 7:15 am
ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి. తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం. తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు. హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది.”అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?” అని వేటూరి ప్రభాకరశాస్త్రి వాపోయారు.ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.ఇంగ్లీషు,తమిళ భాషల లాగా మన తెలుగులిపి సంకేతములు ప్రక్కప్రక్కనే కూడా ఉండేలా లిపిసంస్కరణ కోసం ప్రాచీన హోదాద్వారా వచ్చే నిధుల్ని వినియోగించాలి.