పాత్రికేయుడు, అనువాద రచయిత సహవాసి కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, అనువాదకుడు జంపాల ఉమామహేశ్వరరావు బుధవారం 29.08.07 కన్నుమూశారు. ఆయన ‘సహవాసి’ అనే పేరుతో పాఠకలోకానికి సుపరిచితులు. కొంత కాలంగా ప్రొస్టేట్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన విశ్రాంతి కోసం తెనాలి వెళ్లారు. చికిత్స కోసం బుధవారం నగరానికి తరలిస్తుండగా మధ్యలో కన్నుమూశారు.
ఉమామహేశ్వరరావు 1934లో గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జన్మించారు. 1954-58లలో ఆంధ్ర విశ్వవిద్యాలంలో బీఏ ఆనర్స్ చేశారు. 1959లో ఏజీ కార్యాలయంలో ఆడిటర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1981 వరకు కొనసాగారు. 1983 నుంచి 1997 వరకు ‘ఈనాడు’ దినపత్రికలో పనిచేశారు. సంపాదకీయాలు, సంపాదక పేజీ వ్యాసాలు అనేకం రాశారు. చక్కటి, చిక్కటి తెలుగులో బిగి ఏ మాత్రం సడలకుండా ఆయన సంపాదకీయాలు రాసేవారు. తెలుగు అనువాదానికి ప్రామాణికతను తెచ్చినవాడిగా ఆయన గుర్తింపుపొందారు. అలెక్స్ హేలీ ప్రఖ్యాతనవల ‘రూట్స్’కు ‘ఏడుతరాలు’ పేరుతో ఆయన చేసిన సంక్షిప్తీకరణ అత్యంత ఆదరణ పొందింది. అచ్చ తెలుగు నుడికారాలతో చేసిన ఆ అనువాదం అసలైన తెలుగు నవలే అనిపించేలా ఉంటుంది. ఇతర అనువాదాలు ‘రక్తాశ్రువులు’, ‘ఉక్కుపాదం’, రొమిల్లా థాపర్ గ్రంథం ‘తరతరాల భారత చరిత్ర’, బిపిన్‌చంద్ర రచన ‘ఆధునిక భారతచరిత్ర’, అంబేద్కర్ గ్రంథాలు ‘శూద్రులెవరు’, ‘అస్పృశ్యులెవరు’, ఎమిలీ జోలా నవల ‘భూమి’ అనేవి పాఠకాదరణ పొందాయి. మాక్సింగోర్కీ ‘అమ్మ’ నవలతో పాటు ‘పంచతంత్రం’, వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’లను ఆయన సంక్షిప్తీకరించారు. వీటిని పీకాక్ క్లాసిక్స్ సంస్థ ప్రచురించింది. ఆయన స్వయంగా ‘ప్రవక్త, సంస్కర్త – వీరబ్రహ్మేంద్రస్వామి’, ‘వేమన మాట-బాట’, ‘స్వరాజ్య సమరం’ పుస్తకాలు రచించారు. ‘తిరస్కృతులు’, ‘విముక్తి’ అనే అనువాదాలను సొంతంగా ప్రచురించారు. ఆయన ఇటీవలే పూర్తి చేసిన ‘వందేళ్ల తెలుగునవల’ విశ్లేషణ గ్రంథం త్వరలో విడుదల కానుంది. సహవాసి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ జర్నలిస్టు పురస్కారం అందుకున్నారు. మృదుభాషిగా, భోళా మనిషిగా మన్నన పొందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. గురువారం నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయి. సహవాసి మృతి తెలుగు సాహిత్యానికి తీరనిలోటని లోక్‌సత్తా జాతీయ సమన్వయకర్త జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.