తస్లీమా నస్రీన్‌పై అనాగరిక దాడి
తస్లీమా రచించిన ‘శోధ్’ పుస్తకాన్ని హైదరాబాద్‌కు చెందిన రచయిత్రి వెనిగళ్ల కోమల ‘చెల్లుకు చెల్లు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీంతోపాటు మరో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్ సంస్థ, శాస్త్రీయ పరిశీలనా కేంద్రం 09.08.2007వ తేదీ గురువారం ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ దీనికి వేదిక. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తస్లీమాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమెతోపాటు ప్రముఖ రచయిత్రి ఓల్గా, హేతువాద సంఘం ప్రతినిధి ఇన్నయ్య తదితరులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు మొదలైన కార్యక్రమం 12.10 వరకు నిర్విఘ్నంగా కొనసాగింది.

తస్లీమా నస్రీన్ పై దాడి
దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు
కార్యక్రమం పూర్తయి ఓల్గా, తస్లీమా వెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు. అంతలో తస్లీమా అక్కడ ఉందన్న సమాచారం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యే మౌజంఖాన్ అంగరక్షకులతో దూసుకువచ్చారు. సమావేశ మందిరంలోకి ప్రవేశించారు. వస్తూనే… ‘ఇక్కడికి ఎందుకొచ్చావ్? ఎలా వచ్చావ్?’ అంటూ ఏకవచనంతో తస్లీమాను నిలదీశారు. ‘నువ్వు ఇస్లాం మత విద్వేషివి’ అంటూ దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ఇన్నయ్య తదితరులు వారిని అడ్డుకున్నారు. ఈలోగా ఎమ్మెల్యేల అనుచరులు మరికొంతమంది లోపలికి దూసుకువచ్చారు. ఎమ్మెల్యే మౌజంఖాన్ ఓ పుస్తకాన్ని తస్లీమాపై విసిరేశారు. మరో ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్ ఏకంగా కుర్చీ ఎత్తి ఆమెను కొట్టబోయారు. వారి అనుచరులు చేతికందిన వస్తువులను, పూలబొకేలను ఆమెపైకి విసిరారు. ఈ తోపులాటలో ఇన్నయ్యను కొట్టడంతో ఆయనకు పెదవిపై గాయమైంది. ఒకదినపత్రిక ఫొటోగ్రాఫర్ కూడా గాయపడ్డారు.

తస్లీమా నస్రీన్