శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలో భావచిత్రాలు

- డా. పి.సంజీవమ్మ

శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ ఇరువురూ సమకాలికులు. స్వయానా కాకపోయినా సోదరులే, ఇరువురూ అభ్యుదయ కవులే. అయినా శ్రీశ్రీ పాపులర్‌ అయినంతగా నారాయణబాబు కాలేదు. కొందరి విషయం అంతే. ఆయన శతజయంతి సంవత్సరం పూర్తి అయింది.
శ్రీశ్రీ కవిత్వం వుద్వేగంతో పరుగులు తీసేది, నారాయణబాబుది నిలిచి నిలకడగా ఆలోచింపజేసేది. శ్రీశ్రీ కవిత స్థూల దృష్టికి అందుతుంది, నారాయణబాబుది సూక్ష్మదృష్టికి తప్ప అందనిది, గాఢత పెనవేసుకున్న కవిత. ఆయన్ని ఆధునిక తెలుగు కవుల్లో ప్రథమ శ్రేణిలో నిలపడానికి ‘రుధిర జ్యోతి’ కవితా సంకలనం ఒక్కటి చాలు.
నారాయణబాబు 1935 ప్రాంతం నుండి 1960 వరకు పాతిక సంవత్సరాల పాటు రచించిన కవితలు సుమారు నలభై వరకు వున్నాయి. వీటిని సంకలించి మొదటిసారి 1972లో అచ్చు వేయించిన ఘనత ఆరుద్రగారిది. భారతి, ప్రతిభ, జ్వాల మొదలైన పత్రికల్లో ఆయా కవితలు ఆనాడే ప్రచురితాలు. అందులో ప్రసిద్ధమైన కవితలు “కవీ! జ్వలనా, గడ్డిపరక, దేశమాత, కపాల మోక్షము, వేశ్య, లెండోయి ఋషులు, మౌనశంఖం” మొదలైనవి.
రుధిర జ్యోతిలో భావచిత్రాలు పరిశీలించేముందు భావచిత్రాల గురించిన అవగాహన అవసరం. ఎందుకంటే తెలుగు సాహిత్య విమర్శలో, పరిశోధనలో భావచిత్రాల గురించి చెప్పుకోదగిన కృషి జరగలేదు. కవిత్వంలో అలంకారాలకు, భావచిత్రాలకు వుండే తేడాలు, వాటి ధర్మాలు, స్వభావం గురించి విమర్శకులకే సరియైన అవగాహన లేదు. అందువల్ల భావచిత్రాల గురించి కొంత విశ్లేషణ చేసుకుంటే తరువాత ‘రుధిరజ్యోతి’ కవితల్లోని భావచిత్రాల సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
ఆధునిక కవిత్వపు భాష ప్రధానంగా భావచిత్రాల భాష. భావచిత్రాన్ని భావ బింబాలు, పదచిత్రాలు అని కూడా అంటారు. భావచిత్రాలు ఆధునిక కవితకు ప్రాణం – ప్రణవం. అలంకారాలు కావ్యాల్ని అలంకరించే ధర్మం కలవి. శోభాకారక ధర్మం ప్రధానంగా కలవి. కాని భావచిత్రాలకు అది మాత్రమే ధర్మం కాదు. వాస్తవికతను బింబించి కవిత్వానికి ప్రాణం పోసేవి భావచిత్రాలు. సామాజిక వాస్తవికతను వ్యక్తం చేస్తూనే పాఠకుని మనోలోకంలో సంవేదన రగిలించే సామర్థ్యం కలవి, హృదయాల్ని అనుభూతిమయం చేసేవి భావచిత్రాలు.
ప్రాచీన కవిశ్రేష్ఠులు వాల్మీకి, కాళిదాసాదులు ప్రయోగించిన ఉపమా రూపకాలంకారాలు వాస్తవికతకు దగ్గరగా వుంటూ ఉదాత్తతను సంతరించుకున్నవి, పాఠకుల మనసుల్ని అనుభూతిమయం చేయగలిగిన సత్తా వున్నవి. కాని రానురాను కావ్యాలు, ప్రబంధాలు అలంకారాల బరువు మోస్తూ అనుభూతిని కలిగించే గుణం కోల్పోయినాయి. అలంకారాల్లో కృత్రిమత్వం చోటు చేసుకుంది.
భావచిత్రాలు కవితా కళను సౌందర్యవంతం చేస్తాయి. వాటిలో సౌందర్యాత్మక అనుభూతి వస్తునిష్ఠంగా వుంటుంది. వస్తువు – అభివ్యక్తి ఈ రెండూ విడదీయరానంతగా కలబోసి వుంటాయి. భావచిత్రాల మీద కవి ఆలోచనల ప్రభావం వుంటుంది. ఆలోచనల కంటే కూడా కవి యొక్క జీవన దృక్పథం (గీలిజిశిలిదీ రీబీనీబితితిదీవీ), కవి యొక్క వ్యక్తిత్వ ప్రభావం అధికంగా వుంటుంది. భావచిత్రాలు వచన ప్రక్రియల్లో కూడా ప్రయోగిస్తారు. ఉదాహరణకు “పుణ్యభూమీ కళ్లుతెరు” అనే నవలను పరిశీలించవచ్చు. కాని భాషాపరంగ కవితా కళలోనే భావచిత్రాలు సహజంగా ఇముడుతాయి
.
భావచిత్రాల్ని సంవేదన ఆధారంగా కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. దృశ్యబింబాలు, శ్రవ్యబింబాలు, స్పర్శబింబాలు, ఘ్రాణబింబాలు మొదలైనవి. అనుభూతి ప్రేరకంగా వుండే, గతిశీలమైన బింబాలు మరొక రకం. కొన్ని భావ చిత్రాలు సంశ్లిష్టంగా కూడా వుంటాయి. భావ తీవ్రతను వ్యక్తం చేయడానికి అవి అవసరం అవుతాయి. సంవేదనా, అనుభూతీ, ఆలోచనలకు సౌందర్యభావన తోడైతే కవి భావచిత్ర సృజనతో కవితకు ప్రాణం పోస్తాడు. కవితా ధోరణుల్ని బట్టి భావచిత్రాలు మారుతూ వుంటాయి. భావ కవిత్వంలో భావ చిత్రాలు యధేచ్ఛ కల్పనతో కూడి వుంటాయి. అభ్యుదయ కవిత్వంలో వాస్తవిక జీవితానికి దగ్గరగా వుంటాయి. అభ్యుదయ భావాల్ని వ్యక్తం చేస్తాయి. కొందరు ఆధునిక కవులు తమ కవిత్వాల్లో నిరంతరంగా భావ చిత్రమాలను సృజిస్తూ పోయారు. కవిత్వం ఇమిడించుకోలేని భావచిత్రమాల కృతకమైపోయి పాండిత్య స్ఫోరకమవుతుంది, ఔచిత్యాన్ని కోల్పోతుంది. ఆడంబరాన్ని సూచిస్తుంది. ప్రబంధాల్లోని కృతక అలంకార తత్వాన్ని గుర్తుకు తెస్తుంది. కాబట్టి ఆధునిక కవి భావచిత్రాల్ని పొదుపుగా ప్రయోగిస్తే కవిత్వంలో జీవకళ వుట్టిపడుతుంది.
రుధిరజ్యోతిలో శ్రీరంగం నారాయణబాబు “రుధిర జ్యోతిర్‌ లలనా ప్రియుండ, విప్లవ ఋషిని, విద్రోహ కవిని, ఆహవరంగం నా హృదంతరంగం” అని చాటుకున్నాడు. “ఈ ప్రపంచ జీవన వైతరణి దాటేందుకు నీ కోసం నే చేసిన గోదానం ఈ గీతం” అంటూ పాఠకున్ని సంబోధించాడు. “కవిత్వమంటే అతిమృదులమైనదీ బహు సరళమైనదీ మందుగుండులాంటిది” జాగ్రత్త అని కూడా హెచ్చరించాడు. మరి ఇలాంటి ‘రుధిరజ్యోతి’లోని కవితల్లో భావ చిత్రాల్ని పరిశీలిద్దాం.
‘కవీ’ అనే శీర్షికగల కవితలో నేటి సమాజంలో కవి యొక్క బాధ్యతను గుర్తు చేస్తాడు. నేటి సామాజిక వాతావరణాన్ని ప్రకృతిలోని వాతావరణ చిత్రణ ద్వారా రూపిస్తాడు – సంధ్యా సమయం – చీకట్లు ముసురుతున్నాయి – ఆకాశంలో తారలు పొడసూపుతున్నాయి – కాలం పరిగెడుతోంది – అర్ధరాత్రి మీరి రెండు గంటలయింది – గాలి అమాయకంగా వీస్తూంది. చుక్కల ఆకాశం “ఒళ్ళు తెలియని పుళ్ళ బాధతో వెక్కి వెక్కి ఏడుస్తోంది”. కారణం? ఒక విధవరాలు పురుష సమాజపు దౌష్ట్యానికి బలి అయింది. ఒక మునిమాపువేళ బిడ్డకు జన్మనిచ్చి తన జన్మ చాలించబోతూంది. ఆ తల్లి చేతుల్లో పసిగుడ్డు -
“పెదిమల వెలుగై వెలిగి నలుపెక్కిందీ సంధ్య” అంటూ కవి సంధ్యా సమయాన్ని చిత్రీకరిస్తాడు. ఆ వాతావరణంలో చీకటులు -
“ఖేదం రేపీ రోదసి నిండి విశ్వగళమ్మున హాలాహాలమై విస్తరిల్లినాయి” అంటాడు. జరిగిన అన్యాయానికి ప్రకృతి యొక్క ప్రతిస్పందన అది. ఇక-
“గగనమ్మున తారలు నల్లని త్రాచు కోరలు, తెల్లని మశూచి కుండలు” అంటూ వ్యక్తీకరిస్తాడు. నల్లని త్రాచు కోరలు, తెల్లని మశూచి కుండలు నక్షత్రాలకు భావచిత్రాలు. ఈ దృశ్య బింబాలు కోపాన్ని, క్రోధాన్ని బీభత్సాన్ని సూచిస్తున్నాయి. కవితా వస్తువు యొక్క సందర్భం అలాంటిది. చీకటి ఆకాశం నల్లని త్రాచు. సన్నగా వెలిగే నక్షత్రాలు దాని కోరలు. ఆకాశమంతటా దట్టంగా అలుముకున్న నక్షత్రాలు తెల్లని మశూచి కుండలు.
కాలం అనే జట్కా గుర్రం పరిగెడుతూనే వుంది. దాని మెడలో గంటలు రెండు మ్రోగాయి. సమయం అర్ధరాత్రి దాటి రెండు గంటలు, కనపడని కాలానికి శ్రవ్యబింబం ప్రయోగించాడు. ఇక గాలి వీస్తూనే వుంది అమాయకంగా. ఆ “చచ్చిన తల్లి మెళ్ళో గజ్జెల పట్టెడతో వుల్లాసంగా ఆడుకునే పసిపిల్లవాడు”లా గాలి! వీస్తూనే వుంది. ఇది స్పర్శబింబం. విధవతల్లి తనువు చాలించింది. పిల్లవాడు – సమాజ బీభత్సం ఏమీ తెలియని పిల్లవాడు తల్లి మెడలో గజ్జెల పట్టెడతో ఆడుకుంటున్నాడు – అంత అమాయకంగానూ వీచే గాలి.
ఇదంతా చూస్తున్న చుక్కల ఆకాశం – “ఒళ్ళు తెలియని పుళ్ళ బాధతో వెక్కి వెక్కి ఏడ్చిందట!” అవును ప్రకృతి రోదిస్తూంది! సమాజం యొక్క వికృతానికి అది ప్రత్యక్ష సాక్షి! ఎంత వేదనామయ అనుభూతి!
ఈ బీభత్స సాంఘిక వాతావరణంలో ఓ కవీ! ఖ్యాతి గడించే గీతం వ్రాసి ప్రేయసికి అంకితం ఈయాలంటూ మూతి బిగించి చేతులు నులుముతూ కూచున్నావా?! అని కవి హెచ్చరిస్తాడు, ఎగతాళి చేస్తాడు. స్త్రీలకు ఒకవైపు ఆ విధంగా అన్యాయం జరుగుతూంటే మరోవైపు నీవు ప్రేయసి గురించి గీతాలు వ్రాసి ప్రఖ్యాతి పొందాలని చూస్తావా అని భావ కవులను హెచ్చరిస్తున్నాడని వేరే చెప్పనక్కరలేదు.
మరో కవిత ‘దేశమాత’. ఇందులో బిచ్చగత్తెను దేశమాతగా దర్శిస్తాడు, దేశమాతకు సంకేతంగా నిలుపుతాడు కవి నారాయణబాబు. దేశం యొక్క, సమాజం యొక్క పరిస్థితిని బిచ్చగత్తె దీనహీన స్థితిని చిత్రించటం ద్వారా నిరూపిస్తాడు.
“ఎండాకాలం ఎండాకాలం
పగళ్లు నెగళు
మండే రోడ్డు పన్నెండు గంటలు
కాలం కాలిన గుడ్డ పేలికై ధూళి రేగినది…”
అంటూ కవిత ప్రారంభిస్తాడు. కాలం కాలిన గుడ్డపేలిక, ఎండాకాలం మండిపోతూంది. ఈ భయంకర దుర్భర బీభత్స వాతావరణాన్ని ‘కాలిన గుడ్డపేలికై’ ధూళి రేగింది అని ఘ్రాణ బింబం ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. ఆ సమయంలో “గుప్పెడు అన్నం గ్రుక్కెడు నీళ్ళ స్వాతి వానకే ముత్యపు చిప్పై, కరువే రూపం దాల్చిన కడుపే చెరువై ఏడ్చి ఒక భిక్షుకి భిక్షా పాత్రతో నిలబడ్డది -
ఆమె రెండు కన్నులు
కాలిన బండికమ్ములు…
కాలిన మారుని తూపులు కలికి చూపులు-
ఆకలి దాహం అన్నం అన్నం అంటూ అలమటించింది!
ఆమె మొరను ఒక్కరూ ఆలకించలేదు.”
“బలి ప్రముఖుల పాతర భరతభూమి”లో ఆకలితో అసువులు బాసింది.
“చచ్చిన దేశమాతయై, చాప చుట్టగ నేలకు వాలింది!” సాటి మానవులు కాకపోయినా విశ్వాసంగల కుక్క గాడిదవంటి జంతువులు ఆమె చావుకు నిట్టూర్చాయట! పాఠకులు కూడా గాఢమైన నిట్టూర్పు విడువక తప్పదు.
“ఆకలి తీర్చని మానం గప్పని
దేశం కోసం మట్టి ప్రమిదలో
వత్తై కాలింది ఆ మానిని!” ఈ పాపం ఎవరిది? ఈ పరిస్థితులకు కారణం ఎవరు? గాఢంగా ఆలోచింపచేసే వేదనామయ కవిత!
శ్రీశ్రీ “భిక్ష వర్షీయసి!” అనే కవిత ఈ సందర్భంగా గుర్తుకు వస్తుంది. రెండు కవితల్లోనూ బిచ్చగత్తె దీనావస్థ చిత్రించబడింది. నారాయణబాబు ఒకడుగు ముందుకు వేసి బిచ్చగత్తెను దేశమాతగా సంకేతించాడు.
“తెనుగురాత్రి” అనే కవితలో పేదల ఆకలి దుస్థితిని వర్ణిస్తూ – “పేదవాని కడుపుమంట కాలి పేలిపోవు కోర్కె గగనమ్మున చుక్క” అని బింబిస్తాడు. పేదవాని కడుపుమంట కాలి, పేలిపోయిన కోర్కె ఆకాశంలో చుక్క అయిందట! ఎంత శక్తివంతటమైన భావచిత్రం! ఈ భావచిత్రాలు మరఫిరంగి గుండ్లు అనో, తుపాకీ తూటాలు అనో చెబితే చాలా తక్కువే అవుతుంది.
ఆకాశంలో నెలవంక “మాసిపోని గాజుముక్క” అట! భావచిత్రం అందంగా వుంది. కాని కవి అంతటితో ఆగిపోలేదు. అది ‘సంఘం వంక’ అంటూ మరో భావచిత్రం ద్వారా మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాడు. ఆ నెలవంక సంఘం పట్ల పగతీర్చుకునే శస్త్రంలాగ కూడా కనిపిస్తున్నదట! సమాజంలోని దుష్ట పరిస్థితిని ప్రకృతిలోని భావచిత్రాల ద్వారా నిరూపించడం ఇది. దీనుల, దరిద్రుల ఆకలిమంటలే అభ్యుదయ కవుల చేత కవితాస్త్రాన్ని సృజింపచేశాయి.
‘వేశ్య’ అనే మరో కవిత చాలా చిన్నది. కాని ఆమె దైన్యాన్ని, హృదయ వేదనను రెండు మూడు భావచిత్రాలతోనే గాఢంగా నిరూపిస్తాడు నారాయణబాబు- “దంతపు వీణైతే నేమి ఒళ్ళు?
తెగిపోయిన తీగ – బతుకు
మేళన చేయని హృదయం
నీ వ్రేళ్ళకు బాధె మిగులు
నను ముట్టకు నా చక్కని స్వామి!”
ఈ భావచిత్రాలకు వివరణే అవసరం లేదు.
“భగత్‌సింగు శాపము” అనే కవితలో ఆ వీరున్ని వురితీసిన రాత్రిని వర్ణిస్తాడు-
“చల్లని రాత్రి నల్లని జండా నాలుక చాపింది…
చుక్కల చూపులు కూడా సురిగిన మొండిరాత్రి…
భరతభూమి పాడి యావునకు
కళ్ళలో కాటుక పొగలు
బుఱ్ఱను భూకంపం
గుండెల్లో కుతకుత వురికే లావా!”
భరతభూమి పాడియావే కానీ తన ముద్దు బిడ్డను వురి తీసిన సమయాన ఆమెకు కలిగిన క్రోధం, దుఃఖం ఈ భావచిత్రాల ద్వారా నిరూపించాడు.
‘భావం’ అనే కవితలో కవి హృదయం నుండి భావం ఎలా బయటపడుతుందో వర్ణిస్తూ-
“వేడిగ గీతం
నివురుగప్పిన నిప్పు హృదయం
కుదిపిన కుంపటి జీవితం…” అంటూ బింబిస్తాడు.
‘పండుగనాడు’ అనే మరో కవితలో సంక్రాంతి పండుగ కవితా సంబరాల్ని నిరసిస్తూ ఎగతాళి చేస్తూ అంటాడు -
“కాలిన ప్రేయసి దేహం చమురు కంపు – ఈ లోకం
పాడాలట! పాడాలట!…”
లోకంలో పరిస్థితిని బీభత్సమయంగా నిరూపిస్తూ అలాంటి పరిస్థితిలో గేయాలు గానం చేయగలమా అని నిలదీస్తాడు. ఈ బీభత్సానికి దూరంగా వెళ్ళాలన్నా లోకంతో వుండే అనుబంధాన్ని త్రెంచుకోలేడు మానవుడు. కాలిన ప్రేయసి దేహమూ అంతే. చమురు కంపు కొడుతున్నా ప్రేయసితో అనుబంధాన్ని వదలి దూరంగా పారిపోలేడు ప్రియుడు.
ఇలాగే నారాయణబాబుగారి ఒక్కొక్క కవితనూ పరిశీలిస్తూ పోతే అవన్నీ భావచిత్రాల గనులు. క్లుప్తత, సంశ్లిష్టత, గాఢత పెనవేసుకున్న కవితా శిల్పం ఆయనది. అనంతమైన అనుభూతిని, ఆలోచనామృతాన్ని ప్రసాదించేవి. సంవేదనను రగిలించేవి. ‘రుధిరజ్యోతి’ అనే పదబంధం ఆయన కవితల్లో పలుమారు పునరావృతమవుతూ వుంటుంది. ఆయన మనసు పడిన పదబంధం అది. అది విప్లవ తత్వాన్ని సూచించే ఫిరంగిగుండు. శ్రీశ్రీపట్ల సోదరాభిమానంతో నారాయణబాబు ఇలా అన్నాడు -
“నీ పాటల కత్తులతోనే
నా హృదయం నెత్తురు తీసి
నే వెలిగించిన ఈ దీపపు కాంతిని
నర్తింపుముర శ్రీ శ్రీశ్రీ!”
అవును- ఆయన హృదయరుధిరం నుండి వెలిగినవే ఆయన కవితా జ్యోతులన్నీ.

1 Comment »

  1. bollojubaba said,

    April 8, 2009 @ 2:41 am

    నారాయణ బాబు ని ఎందుకో పైకి రానీయలేదనిపిస్తుంది. ఈ తని కవిత్వంలో అద్బుతమైన పదచిత్రాలు కానీ, ఒక రకమైన తీక్షణత కానీ కనిపిస్తుంది.
    ఒకా నొక సందర్భంలో ఆవంత్స సోమసుందర్ గారు, నారాయణబాబు కవిత్వంపై వ్యాసపరంపర వ్రాసినప్పుడు, ఒక గొప్ప సభజరిపి ఆయనకు సన్మానం జరిపినపుడు కానీ, వారికి శ్రీశ్రీ నుండి మందలింపులు రావటం ఆనాటి పక్షపాత సాహితీ వాతావరణానికి సంకేతం. (ఈ ఉదంతం స్వయంగా శ్రీ సోమసుందర్ గారే చెప్పారు).
    నారాయణబాబు కూడా విస్త్రుతంగా వ్యాసంగం చేయకపోవటం, వార్తల్లో ఉండటానికి ప్రయత్నించకపోవటం (శ్రీశ్రీ లా) వీరి ప్రతిభ కనుమరుగైపోవటానికి మరో కారణం కావొచ్చు.

    ఈ వ్యాసం నారాయణబాబు కవిత్వపు ఆత్మను పట్టుకొని సమర్ధవంతంగా ఆవిష్కరింపచేసింది.
    సంజీవమ్మగారికి నమస్కారములు
    అభినందనలు
    బొల్లోజు బాబా

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో