పడి లేచిన కడలితరంగం – పెనుగొండ లక్ష్మినారాయణ

– కోట పురుషోత్తం

పెనుగొండ లక్ష్మినారాయణను చిటికెన వేలు పట్టుకుని గుండ్లకమ్మ రైల్వేస్టేషను దగ్గరకు తీసుకుని వెళ్తున్నాడు తండ్రి. లక్ష్మినారాయణ అప్పట్లో ఫిరంగిపురంలో చదువుతున్నాడు కాబట్టి అక్కడికా పిల్లవాణ్ణి పంపాలి. ఒక బంధువు ఈ తండ్రీ కొడుక్కి ఎదురుపడి, ”ఎందుకురా చదువు చదువు అని పిల్లల కోసం అంతంత డబ్బు తగలేస్తావు? వీళ్లకేం చదువొస్తుంది రా? ఏ రోజైనా వ్యవసాయం చేసుకుని గొడ్లు మేపుకుని బతకాల్సిందే గదా. మనం రైతులమని మరిచిపోవద్దు” అన్నాడు. అనేసి పోయాడు.
ఎక్కడో మారుమూల వినుకొండ దగ్గర నూజెండ్ల మండలంలో వున్న చెరువుకొమ్ముపాలెం లక్ష్మినారాయణ వూరు. ఆ వూర్లో నుంచి పరాయి వూళ్లకు వెళ్లి చదువుకోవడం అనేది లక్ష్మినారాయణ ఇంటి నుంచే మొదలైంది.
లక్ష్మినారాయణ వాళ్ల నాన్న ఎంతోమంది తల్లిదండ్రులతో, ”మీ పిల్లలను కూడ బాగా చదివించండి. వృద్ధిలోకి వస్తారు” అని విద్య విషయంలో ఎంతగానో ప్రోత్సహించేవాడు.
ఆ బంధువు అలా మాట్లాడేసి వెళ్లిపోయినా లక్ష్మినారాయణలో ఆలోచనా స్రవంతి ఆగలేదు. విద్య విషయంలో, అన్నయ్యనీ తననీ చదివించడంలో నాన్న ఎంతగా అగచాట్లు పడుతున్నాడో బాగా బోధపడింది. తండ్రికి చదువుపట్ల వున్న దీక్ష లీలామాత్రంగా అవగతమైంది.
కరువు పరిస్థితుల వల్ల చదువుకు సంబంధించి ఏ ఖర్చు వచ్చిపడ్డా తండ్రి అప్పు చేయాల్సిన దుర్గతిని చిన్న వయసులోనే ఆకళింపు చేసుకున్నాడు లక్ష్మినారాయణ.
బంధువు అలా మాట్లాడేసి వెళ్లిపోయిన రోజున్నే లక్ష్మినారాయణకు అర్థమైపోయింది. తను బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.
ఇంటర్‌ పాసయ్యాడు 1971లో. ఏం లాభం?
ఆర్థిక పరిస్థితుల వల్ల విద్యకు అయిదేళ్ల విరామం ఏర్పడింది. 1973లో పొట్ట చేతబట్టుకుని అంటారే అలాగే గుంటూరులో అడుగుపెట్టాడు లక్ష్మినారాయణ. న్యాయవాది గూడవల్లి నాగేశ్వరరావు దగ్గర గుమాస్తాగా చేరాడు. సాయంత్రాలు ఇండో సోవియట్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో బాయ్ గా పనిచేసేవాడు.
వినుకొండలో ఇంటర్‌ చదివే రోజుల్లోనే పత్రికా పఠనం బాగా అలవాటైంది. అదే లక్ష్మినారాయణ మనసును సాహిత్యరంగం వైపు మరల్చింది.
ప్రభుత్వ పరిపాలన సరిగా లేదని, ప్రజలు వేధింపులకు గురి అవుతున్నారనే ఆలోచనలు మనసుకు తట్టి వామపక్ష పార్టీ అభిమానిగా మార్చివేశాయి. ఆ ప్రభావమే అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడిగా చేర్చింది.

పెనుగొండ లక్ష్మీనారాయణ

పెనుగొండ లక్ష్మీనారాయణ

కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారిక పత్రిక విశాలాంధ్రలో పనిచేయడంతో రచన అలవడింది. అభ్యుదయ సాహిత్యం చదవడము, వ్రాయడముతో మనసు వికసించి పుష్పించి పరిమళించింది.
1974లో తెనాలిలో జరిగిన అరసం సభలకు హాజరై మంచి స్పూర్తిని పొందాడు. తొలిసారిగా అదే ఏడాది ‘విపంచి’ పక్ష పత్రికలో ఆయన రాసిన కవితలు అచ్చయ్యాయి.ప్లీడరు దగ్గర గుమాస్తాగిరీ వదిలేశాక గుంటూరులోనే ఒక పొగాకు కంపెనీలో పనిచేశారు. స్వయంకృషితో ఎ.సి. ఈవెనింగ్‌ కాలేజీలో బి.ఎ. చదివి ఆ తర్వాత అక్కడే లా కాలేజీ నుంచి బి.ఎల్‌. చేసి గుంటూరులో బార్‌ అసోసియేషన్‌లో లాయర్‌ ప్రాక్టీసు ప్రారంభించాడు. రాష్ట్రంలోనే పెద్దదయిన గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జిల్లా బార్‌ అసోసియేషన్ల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. పరుచూరు రాజారాం వంటి ప్రముఖుల శిష్యరికంలో కవిత్వం విరివిగా రాసేకంటే కవిత్వాన్ని అధ్యయనం చెయ్యడంలో వున్న మజా గుర్తించాడు. కథా రచయితల, కవుల శైలీ విన్యాసాలను సమగ్రంగా పరిశీలించాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ రచయితలైన పురిపండా, రోణంకి, చాసో వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది.
ఓవైపు న్యాయవాదవృత్తి, మరోవైపు సాహితీ సేద్యం. 1984లో కథా స్రవంతి పేరున కథా సంకలనాలు తీసుకువచ్చాడు. 84 నుంచి 91 దాకా నాలుగు సంపుటాలుగా కథా స్రవంతి వెలువడింది. బల్గేరియా కవిత, అరాచకీయం, స్మృతి రేఖలు, విస్మృత కథ వంటి కవితా, కథా సంకలనాలు కూడా ఆయన తన మిత్రులు, గురువులతో కలిసి ప్రచురించాడు.
విశాలాంధ్ర వారు ప్రతిష్టాత్మకంగా ప్రచురించిన ‘తెలుగుకథ’కి కేతు విశ్వనాధ రెడ్డి, సింగమనేని నారాయణలతో కలిసి సంపాదకత్వం వహించాడు.
ఈయన పాపినేని శివశంకర్‌తో కలిసి సంకలనం చేసిన ‘కవితా ఓ కవితా’ అనే గ్రంథం పలు విశ్వవిద్యాలయాలు పాఠ్యపుస్తకంగా పెట్టాయి.
తెలుగు సాహిత్య అకాడమీ 1997 జనవరిలో నిర్వహించిన రచయితల గోష్టిలో పాల్గొని ‘తెలుగులో కథా సంకలనాలు – స్థూల పరిశీలన’ అనే అంశంపై పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించాడు. ఈ వ్యాసం తెలుగు పత్రికలో ప్రచురితం కాగా ఈ వ్యాసానికి ఎంతో ఆకర్షితుడై స్ఫూర్తి పొంది కథల మాష్టారు కారాగారు శ్రీకాకుళంలో ‘కథానిలయం’ నెలకొల్పాడు.
ఇంటర్‌ అయ్యాక అయిదేళ్లు చదువు మూలపడినా కూడ సొంత కృషితో చదివి సమాజంలోనూ, రచయితలలోనూ ఈ స్థాయికి చేరుకున్న లక్ష్మినారాయణ నేటి యువతరానికి స్ఫూర్తి అని చెప్పక తప్పదు.
అభ్యుదయ రచయిత డా|| ఎస్వీ సత్యనారాయణ పెనుగొండ లక్ష్మినారాయణ గురించి ఒక కవితలో ఇలా అన్నాడు.
”అతడొక అభ్యుదయ సాహిత్యోద్యమ కార్యకర్త
అరుదుగా అద్భుతమైన కవితలల్లే కావ్యకర్త
ఆధునికకథా సరిత్సాగరంలో
ఆణిముత్యాల నేరుకుంటూ వుంటాడు
అందమైన కవితా పంక్తుల్ని మననం చేస్తూ
అందరికీ పంచుతూ వుంటాడు
అతడొక మౌన కృషీవలుడు.”

Leave a Comment

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో